Peddapalli |పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 20: పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం పుట్టపల్లి ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. పెద్దపల్లి-ధర్మారం-చొప్పదండి ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వస్తువులను ఉంచి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి. రోడ్డు మధ్యలో బూడిద, పెంకులు, తెల్లటి పొడి చల్లినట్లు కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి మండలం పుట్టపల్లి బస్టాండ్ వద్ద స్థానిక రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రోడ్డు మధ్యలో కొన్ని వస్తువులను, తెల్లటి పొడిని చల్లి నిప్పు పెట్టినట్లుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. రోడ్డు మధ్యలో నిప్పు పెట్టిన ఆనవాళ్లు, బూడిద, పెంకులు, తెల్లటి పొడి చల్లినట్లు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భయాందోళనలో స్థానికులు: ఇది శనివారం రాత్రి వేళల్లో జరిగిన చేతబడి లేదా మంత్రగత్తెల క్షుద్రపూజల వల్లే జరిగిందా, లేక ఎవరైనా ఆకతాయిలు కావాలనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రోడ్డు మధ్యలో వస్తువులు ఎవరు ఉంచారు? ఎందుకు నిప్పు పెట్టారు? అనే అంశాలపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.