హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాల అమలు, రోజువారీ ఖర్చుల కోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇండెంట్ పంపింది. మార్చి 2న జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో 20 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 26 ఏండ్ల కాలపరిమితితో రూ.500 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు తీసుకుంటామని ప్రతిపాదించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై సర్వత్రా చర్చ మొదలైంది.
రేవంత్రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెకలకు, క్షేత్రస్థాయిలో అడ్డగోలుగా చేస్తున్న అప్పులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.80,800 కోట్ల అప్పులు తెచ్చింది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యం కంటే ఇప్పటికే 30% శాతం అధికం. దీనిపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. కేవలం అప్పులపైనే ఆధారపడటం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నది. ఈ ఏడాది జనవరి నాటికే రూ.71,800 కోట్ల అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మరో రూ.9,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. తాజాగా మార్చి 2న తీసుకునే రూ.2,500 కోట్లతో కలిపి మొత్తం రుణాలు రూ.83,300 కోట్లకు చేరనున్నాయి. ఇది బడ్జెట్ అంచనాల కంటే 54.23% అధికం. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ మరింత లోతుగా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆర్థిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలొని ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే తెలంగాణ కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో చికుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Box