Harish Rao | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను రాజకీయంగా ఎదుర్కోలేక.. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ నాయకులు కక్షకట్టారని, ఇప్పటికే ఆయనపై నాలుగు తప్పుడు కేసులు పెట్టారని ఆ కేసుల్లో ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చినా ఎలాగైనా జైలుకు పంపాలన్న దురుద్దేశంతో వెంటనే మరో కొత్త అక్రమ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు మారాలని మల్లికార్జున్ గౌడ్‌ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.