ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 28 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శనివారం ఖమ్మంలోని పాత బస్స్టాండ్ సెం టర్లో ప్ల కార్డులతో బైఠాయించారు. తొలుత జిల్లా గ్రంథాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పిందం టూ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశా రు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ.. నోటిఫికేషన్లు విడుదల చేస్తారని నెలల తరబడి ఇండ్లకు దూరంగా ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
ఎన్నికల హామీగా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండున్నరేండ్లయినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్వాకంతో తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఎక్కడ? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్-1 నియామకాల్లో సిట్ ఎంక్వైరీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.
జీవో నంబర్ 108 స్థానంలో కొత్త జీవో జారీ చేయాలని, జీవో నంబర్ 29, 66లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు విస్తరింపజేస్తామని స్పష్టంచేశారు.