సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిలోని మణికొండ, కొండాపూర్, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యకలాపాలన్నీ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కార్యాలయాల ఎంట్రీ గేటు నుంచి మొదలుపెడితే ఎగ్జిట్ గేట్ వరకు జరిగే ప్రతి పనిని వారే చక్కబెడుతున్నారు. ఒక్క లైసెన్స్‌కు రూ.5వేలు, ఫిట్‌నెస్‌కు రూ.2000, వాహన బదిలీలో యజమాని మరణిస్తే రూ.6000లు ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. కార్యాలయాల్లోనూ, వాటి పక్కన సమాంతరంగా ఆఫీసులు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఏ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఆదేశాలు.. బేఖాతరు!
ఇటీవల రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీఏ కార్యాలయాల్లోకి ఏజెంట్లు ప్రవేశిస్తే సంబంధిత ఆర్టీఓలదే బాధ్యత అని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీ ఆర్టీఏ కార్యాలయంలో ‘బ్రోకర్లను ఆశ్రయించరాదు’ అనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం తమను ఎవ్వరూ ఆపలేరంటూ ఏజెంట్లు, కొందరు అధికారులు రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి మణికొండ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లను అనుమతిస్తూ, వారు తీసుకొచ్చే పనులను చకచకా చేస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఓ యువతి లెర్నింగ్ లైసెన్స్‌కు మణికొండ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడే ఉన్న ఏజెంట్ వారితో డీల్ కుదుర్చుకుని ఆ పేపర్‌పై కోడ్ రాసి టెస్ట్ రూంలోకి పంపించారు. ఇంకేముంది.. లెర్నింగ్ జారీ అయిపోయింది. శాశ్వత లైసెన్స్ కూడా తామే ఇప్పిస్తామంటూ.. ఆమె వద్ద రూ.5వేలు వసూలు చేయడం గమనార్హం.
అవి ఏజెంట్ల ట్రాక్‌లా.. ?
కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్క రోజుకు కనీసం 150 మందికి పైగా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరవుతారు. వీళ్లలో వంద మందికి పైగా ఏజెంట్లతోనే హాజరవుతారు. ప్రతీ ట్రాక్ నెంబర్ వద్ద ఒక్కో ఏజెంట్ నిలబడి వారికి డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే డబ్బులిస్తారో వారు ట్రాక్ నుంచి బయటకు వచ్చే వరకు వారితోనే ఉండి పని ముగిస్తారు. 8, హెచ్ తదితర రౌండ్స్పై ఎలాంటి అవగాహన లేకున్నా శాశ్వత లైసెన్స్ చేతుల్లో పెట్టేస్తున్నారు.