హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ‘నేను విధుల్లో ఉండగానే కాలికి గాయం అయ్యింది. ఇన్ఫెక్షన్ సోకడంతో మోకాలు వరకు తొలగించారు. సర్జరీ కోసం రూ.25 లక్షల వరకు ఖర్చు చేశాను. నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.60 లక్షల వరకు రావాలి. దయచేసి ఇప్పించండి. ప్రస్తుతం నా దగ్గర చిల్లిగవ్వ లేదు. మందులూ కొనలేని పరిస్థితి’ అని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ ఎస్సై శ్రీనివాస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. వర్ధన్నపేట పీఎస్ నుంచి గతేడాది తాను ఉద్యోగ విరమణ పొందానని, ఏడాది గడిచినా ప్రభుత్వం తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తనకు ప్రభుత్వం నుంచి రూ.60 లక్షలు రావాల్సి ఉన్నా.. పేదరికంలోనే బతుకు వెళ్లదీయాల్సి వస్తుందని వాపోతున్నాడు. ఇప్పటివరకు ప్రభు త్వం నుంచి ఒక రూపాయి అందలేదని పేర్కొన్నాడు. తన దీనగాధను చూసైనా ప్రభుత్వం కనికరించాలని వేడుకుంటున్నాడు. మరోవైపు వరంగల్‌కే చెందిన రిటైర్డ్ ఏఎస్సై మూర్తి.. గుండె సంబంధిత సమస్యలతో సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వీరిలాగే ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులపై రేవంత్ సరార్ దమనకాండ కొనసాగిస్తున్నది. పోలీసుశాఖలో పనిచేస్తూ రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ అందించడంలో తాత్సారం చేస్తున్నది.