హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మార్డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు, నిర్మాణాలకు తక్కువ నష్టం కలిగేలా రూపొందించామని చెప్తూ ఏమారుస్తున్నది. కానీ ఇప్పటి వరకు డీపీఆర్, పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
భూయజమానులను మభ్యపెట్టి లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్నది. ప్రాజెక్టు వివరాలు, ఏఏ ప్రాంతాల్లో ఎంత భూమి తీసుకుంటారు? ప్రాజెక్టు కింద ఎన్ని నిర్మాణాలను స్వాధీనం చేస్తారు? భూములు కోల్పోతున్న యజమానులకు పరిహారం ఎలా ఇస్తారు? అనే వివరాలపై కనీస స్పష్టత ఇవ్వకుండా ముందుకువెళ్తున్నది. మంగళవారం బాపూఘాట్-హిమాయత్‌సాగర్, బాపూఘాట్-గండిపాట ప్రాంతాల ప్రజలను సమావేశాలకు పిలిచి ప్రాజెక్టుపై బాధితులు అడిగిన సందేహాల్లో ఏ ఒక్కదానికీ సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. అధికారుల తీరుపై బాధితులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బిక్కముఖం వేసి చూస్తూ ఉండిపోయారు. దేనికీ స్పష్టత ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించేశారు.
మూసీ డీపీఆర్ లేకుండా, అధికారికంగా నోటీసులు ఇవ్వకుండా సంప్రదింపులకు పిలవడంపై భూ యజయానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. డీపీఆర్ ప్రజల ముందుంచకుండా, ప్రాజెక్టు స్వరూపమేంటో తెలియకుండా అందులో ఏం మార్పులు చేశారో స్పష్టత ఇవ్వకుండానే సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించడం వెనుక మతలబు ఏందనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు విషయంలో ఎమ్మార్డీసీ పూర్తిగా రియల్ ఎస్టేట్ కంపెనీలాగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మూసీ డీపీఆర్ ఏమిటో? అందులో తమ ప్రాంతానికి సంబంధించిన వివరాలేమిటో? ఎంతమంది ఇండ్లు, ఎంత భూమి ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందో? స్పష్టంగా వెల్లడించకుండా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏందని ప్రశ్నించారు.
బాధితులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మార్డీసీ ప్రతినిధి, డిప్యూటీ కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి ‘ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేశాం.. నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చే స్తాం.. చాలా వరకు ఇండ్లు కోల్పోకుండా చూస్తాం’ అని రాగం అందుకున్నారు. డీపీఆర్‌పై స్పష్టత, పరిహారం, భూసేకరణ విధానం, ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించాలని బాధితులు కోరినా డిజైన్ మార్పు అనే మాట తప్ప మరో విషయమే మాట్లాడలేదు. తమ సమస్యలు వినకుండా నిర్వహించే సమావేశం తమకు అవసరం లేదంటూ బాధితులు బహిషరించారు. డీపీఆర్‌తో వస్తేనే సహకరిస్తామని తేల్చిచెప్పారు.