‘పార్టీ నడుపడం చేతగానోడు ప్రభుత్వంలో వేలుపెడ్తా అంటే ఊకునేటోడు లేడు. లేసి తంతే ము..పగిలిపోవాలె. ఎవరి బాధ్యతలు వాళ్లకు ఉన్నయ్. ప్రభుత్వ పెద్దగా నా ఆలోచనలు, నా నిర్ణయాలు నాకుంటయ్. పార్టీ నడిపే వాళ్ల ఆలోచనలు వాళ్లకు ఉండాలె. ఎవరి పని వాళ్లు చేయాలె గానీ నా భుజాల మీద ఎక్కి సవారీ చేయాలని చూస్తే ఎగిరి మొలతాడు మీద తంతా’..
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : ఆయన నోరువిప్పితే బూతుల వరద పారుతుంది. బహిరంగ సభలైనా, పార్టీ సమావేశాలైనా అడ్డూఅదుపూ లేని మాటలు ఆయన నోటివెంట వెలువడుతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ వదలకుండా కడిగి పారేశారు. మీడియా చిట్‌చాట్ పేరుతో ఆఫ్‌లైన్ బాతాఖానీ పెట్టుకుని.. 30 నిమిషాలపాటు సదరు ముఖ్యనేత ప్రభుత్వ సహచరులు, పార్టీ నేతలపై వీరంగం ఆడారట. అధికార కాంగ్రెస్‌లో అగాధాలకు అద్దంపడుతున్న ఈ ఉదంతమే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్! గత నెల చివర్లో ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి వచ్చిన కొద్దిరోజులకు ముఖ్యనేత ఎంసీఆర్‌హెచ్చార్డీలో అతి కొద్ది మంది సన్నిహితులు, కొందరు సన్నిహిత జర్నలిస్టులతో పిచ్చాపాటి మాట్లాడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ‘నోటికి ఎంత వస్తే అంత’ అన్నట్టుగా మొత్తం కక్కేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారని చెప్పి, చివరి నిమిషంలో అధిష్ఠానం పెద్దలిద్దరూ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆయన పక్కన మిగిలిన నేతలు కూర్చున్నారు. ఇదే ఫొటోలను నేషనల్ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేసింది. ఆదే విషయాన్ని ఒక టీవీ చానల్‌కు చెందిన జర్నలిస్ట్ ప్రస్తావిస్తూ.. ‘వంశీ చెప్పిన పాఠం ఎలా ఉంది?’అని అడిగారట! అంతే.. ముఖ్యనేత సహనం కోల్పోయినట్టు తెలిసింది. ‘నేను కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేకపోతే వాళ్లు ఎవరు? వాళ్ల స్థాయి ఏంది?’ అంటూ మరో పరుష పదాన్ని ప్రయోగించినట్టు సమాచారం. కొద్దిగా కూల్ అయిన తర్వాత.. ‘నేను అన్న మాటలను బయటకు చెప్పొద్దు. ఎవరితోనైనా చెప్పినా, పత్రికల్లో రాసినా భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పటికీ నమ్మను’ అని హెచ్చరించినట్టు తెలిసింది. ‘మేమెందుకు చెప్తాం సర్’ అని వారు అనగానే, మళ్లీ పార్టీ నేతల మీద నోటికి పని చెప్పినట్టు సమాచారం. పార్టీకి చెందిన ఇద్దరు, ప్రభుత్వానికి చెందిన ముగ్గురిపై తీవ్ర పదజాలంతో ఊగిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘నేను ప్రభుత్వం తీసుకొచ్చి రెండున్నరేండ్లు అయ్యింది. ఈ సమయంలో కనీసం పార్టీ మండల కమిటీలు కూడా వేయడం చేతగానోడు ఓ విషయాన్ని పట్టుకొని చీటికి మాటికి అధిష్ఠానానికి ఉత్తరాలు రాస్తున్నడు. తుంగతుర్తి పంచాయితీ చూస్తున్నరు కదా? కనీసం ఆ పంచాయితీ కూడా పరిష్కరించలేనోడు ప్రభుత్వంలో వేలుపెట్టాలని చూస్తున్నడు. వానికి ఏం పుట్టింది? పాత కాంగ్రెస్ అని, కొత్త కాంగ్రెస్ అని, లేని గొళ్లెం పెట్టుకుంట కూర్చున్నడు. పార్టీలో వాడేమైనా చేసుకొనీ.. ప్రభుత్వంలో వేలు పెట్టుడు ఎందుకు? ఎదురు తిరిగి ము.. మీద ఒక్క తన్ను తన్నకనా?’ అంటూ మాటలతో రెచ్చిపోయినట్టు తెలిసింది. ఎవరికీ సమాచారం లేకుండా యాదాద్రి దేవాలయ ట్రస్టు బోర్డు కమిటీని ఏర్పాటు చేశారన్న ఆరోపణలపైనా తీవ్ర స్థాయిలో స్పందించారట. ‘వీడు బోర్డు పదవి ఇప్పిస్తానని శెట్టిగాని దగ్గర రూ.కోటి తీసుకుంటడు.. ఇంకొకడు రూ.50 లక్షలు తీసుకుంటడు. రూ.కోటి ఇచ్చినోడు ఏం చేస్తడు? దేవస్థానం దుకాణాలు అమ్మకానికి పెడుతడు. ఇటువంటి వాళ్లకు చెప్పి నేను దేవస్థానం కమిటీ వేయాల్నా?’ అని ఊగిపోయినట్టు తెలిసింది. రూ.కోటి కాదు..అడిగితే రూ.100 కోట్లు ఇచ్చే వాళ్లను చూసి కమిటీ ఏర్పాటు చేశానని, ఇందులో తప్పేమున్నదని ప్రశ్నించినట్టు తెలిసింది. ‘మండల స్థాయి కమిటీల్లో పదవులు పంచడం కూడా చేతగాని వాళ్లకు యాదాద్రి కమిటీ కావాలట’ అని ఆగ్రహం వ్యక్తం చేశారట.
‘ఇంకోడు నల్లికుట్లోడు. చాడీలు మోస్తున్నడు. నేనేం తక్కువ చేసిన. ఆయన శాఖల్లోకి నేనేమైనా తొంగి చూసిన్నా? రూ.వేల కోట్ల అవినీతి జరిగింది నాకు తెలియదా? విజిలెన్స్ వేస్తే మొత్తం బయటపడదా? ఆయనకు ముఖ్య.. కుర్చీ కావాల్నట. లేస్తే కూర్చుందామని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నడు. ఆయనతోటి అయితదా? పదేండ్లు సీఎం సం.. నాకిండు. ము.. మీద తన్నక ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నడు’ అని ఓ సీనియర్ మంత్రిని ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడినట్టు సమాచారం. ‘ఇంకోడు మోపైండు. ఆయనకు కూడా అదే కుర్చీ కావాల్నట. ఆయన కుర్చీ మీదికి వస్తే ఎట్లుంటదో సర్వేలు చేయించుకుంటున్నడు. డబ్బు మదం కాకుంటే, డబ్బుల మూట కట్టంగనే ముఖ్య కుర్చీ దక్కుతదా?’ అని మరో మంత్రి మీద మండిపడ్డట్టు సమాచారం. ‘ఆడబిడ్డ అని సంకన పెట్టుకుంటే ఆమె కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నది’ అని ఓ మహిళా మంత్రిపై ఫైర్ అయ్యారట. ‘చూస్తున్నా.. అందరి వేశాలు చూస్తున్నా’ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అనాల్సిన మాటలన్నీ అనేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు బయటికి చెప్పొద్దని మరోసారి హెచ్చరించి వారిని పంపినట్టు తెలిసింది.