AP News | తిరుపతి: తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 23 వరకు కనుల పండువుగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు సర్వదర్శన ఉచిత టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉచిత టోకెన్ల జారీని తిరిగి నేడు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాల్లో వీటిని జారీ చేస్తారు.
సర్వదర్శనం (Sarvadasrhanam) కోసం క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఈ ఉచిత టోకెన్లను జారీ చేస్తారని సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ టోకెన్లను నిలిపివేసిన విషయం విదితమే. ఈ టోకెన్ల జారీ కార్యక్రమం నేటి నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించి శ్రీవారి దర్శన యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.