హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/తుర్కయాంజల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇంకా తీరలేదు. వరుసగా భూములను కొల్లగొడుతూ వివాదాస్పద నిర్ణయాలతో నిరుపేదలు, రైతులను ఇక్కట్ల పాలుచేస్తున్నది. ప్రభుత్వ ఖజానాకూ తీరని నష్టం చేకూరుస్తున్నది. అదే కోవలో తాజాగా కోహెడ పండ్ల మార్కెట్ భూములు చేరాయి. రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్, లావుణి తదితర నిరుపేదల చేతుల్లో ఉన్న ఏ ప్రభుత్వ భూమినీ వదలని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం గతంలో కేటాయించిన భూములనూ టీజీఐఐసీ ఖాతాలో వేస్తున్నది. వివిధ కంపెనీలకు కేటాయింపు కోసమా? బహిరంగ మార్కెట్లో వేలం వేసి కాసులు పండించుకోవడం కోసమా? అసలు తెరవెనుక మర్మమేమిటో తెలియడం లేదు.
రూ.400 కోట్లతో అత్యాధునిక పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు కోహెడ్‌లో 170 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి.. వివాదాలను పరిష్కరించి మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములనే టీజీఐఐసీ ఖాతాలో వేసి.. మరోచోట గుట్టలు, రాళ్లు ఉన్న భూములను మార్కెట్‌కు కేటాయించింది. పైగా ఆ భూమిలో అనేక మంది రైతులు ఏండ్ల తరబడి సాగులో ఉంటుండటంతో ఈ వివాదాలు తేలేదెన్నడు? భారీ ఎత్తున విస్తరించిన కొండలు, గుట్టలను తొలగించేదెన్నడు? పండ్ల మార్కెట్‌ను అభివృద్ధి చేసేదెన్నడు? అసలు ఈ ప్రభుత్వానికి పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచననే లేనట్టుంది! అని వ్యాపారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండ్ల మార్కెట్‌కు గతంలో కేటాయించిన భూములను టీజీఐఐసీ ద్వారా ఎవరికి కేటాయించనున్నారనేది పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఆధునిక హంగులతో రూ.400 కోట్ల అంచనాతో నిర్మించతలపెట్టిన కోహెడ పండ్ల మార్కెట్ ఇక కలగానే మిగలనున్నదా? అంటే తాజా కాంగ్రెస్ నిర్ణయాలతో నిజమేనని అంటున్నారు. కొత్తపేటలో సుమారు 22 ఎకరాల్లో గడ్డిఅన్నారం మార్కెట్ నగరం మధ్యలో ఉండటం, ట్రాఫిక్ రద్దీ, భారీ వాహనాల్లో పండ్ల ఉత్పత్తులను అక్కడికి తీసుకురావడం కష్టంగా మారడంతో కేసీఆర్ ప్రభుత్వం కోహెడ్‌లో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 507, 548లోని 170 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఇచ్చింది. మార్కెటింగ్‌శాఖ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన రూ.13 కోట్లను దాదాపు 44 మందికి ఎకరం రూ.7.40 లక్షల చొప్పున పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా భారీ మొత్తం వెచ్చించి మార్కెటింగ్ శాఖ అభివృద్ధి చేసుకున్నది.
2021లో కోహెడకు మార్కెట్‌ను తరలించి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున వచ్చిన గాలి దుమారంతో అవి కూలిపోయాయి. దీంతో శాశ్వత మార్కెట్‌ను అభివృద్ధి చేసేంత వరకు తాత్కాలికంగా బాటసింగారంలోని హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్కులో నెలకు రూ.70 లక్షల అద్దె ప్రాతిపదికన పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కోహెడ్‌లో అత్యాధునిక మార్కెట్ కోసం డిజైన్లు సైతం రూపొందించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పాటును గాలికొదిలి విలువైన, చదునైన ఆ భూములపై కన్నేసింది.
గత రెండున్నరేండ్లలో కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటును అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఆ భూములకే ఎసరు పెట్టింది. ఇంతకాలం మార్కెట్ అభివృద్ధిని పక్కనపెట్టడం వెనుక అసలు మతలబు ఇదేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోహెడ్లోని 170 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను టీజీఐఐసీకి బదలాయిస్తున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. మరి టీజీఐఐసీకి కేటాయించిన భూములను కంపెనీలకు కేటాయిస్తారా? వేలం వేస్తారా? అనేది మాత్రం తెలియడం లేదు. ప్రత్యామ్నాయంగా కోహెడ పరిధిలోని సర్వేనంబరు 167లో 239 ఎకరాలను కేటాయించింది. ఆ భూమి అంతా ఎత్తయిన కొండలు, గుట్టలతో నిండి ఉన్నది.
వాస్తవానికి కోహెడ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 167లో 239 ఎకరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు కోసమని హౌసింగ్ బోర్డుకు మార్కెట్ ధర చదరపు గజానికి రూ.350 చొప్పున బదలాయించింది. అనంతరం హౌసింగ్ బోర్డు ఆ భూములను దిల్ (డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్)కు అప్పగించింది. ఆ తర్వాత దిల్ ఆ భూములను పట్టించుకోకపోవడంతో తిరిగి హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకొన్నది. ఆ సమయంలోనే తమకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు.
చివరకు ప్రభుత్వపరంగా ఆ భూముల్లో ఎలాంటి పనులు జరుగకపోవడంతో రైతులు తిరిగి అదే భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పండ్ల మార్కెట్‌కు కేటాయించడంతో రైతులు తమకు పరిహారం ఇవ్వాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారు. అంటే తాజాగా ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రైతుల వివాదంతోపాటు భారీ ఎత్తున కొండలు, గుట్టలతో నిండి ఉన్నందున వాటిని చదును చేయడానికే ఏండ్లు పట్టే అవకాశం ఉన్నదని అధికారులే అంటున్నారు.
కోహెడలోని సర్వేనంబరు 167లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో డీపీఆర్‌ను సిద్ధం చేసి శంకుస్థాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్కెట్ నిర్మాణం చేపట్టాలనే చిత్తశుద్ధి ఉంటే అదే ప్రాంతంలో మరిన్ని వసతులతో మార్కెట్ నిర్మాణం చేపట్టాలి. కానీ కొండలు, గుట్టలు ఉన్న భూమిని మార్కెట్‌కు కేటాయించడం వెనుక కారణమేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ప్రజలను మభ్యపెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్తున్నది. మార్కెట్ నిర్మాణం చేపట్టే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదనిపిస్తున్నది.
– కందాల బలదేవారెడ్డి, కోహెడ, తొర్రూరు డివిజన్
మార్కెట్ నిర్మాణానికి అనువుగా ఉన్న సుమారు 170 ఎకరాల స్థలంలో మార్కెట్‌ను ఏర్పాటు చేయకుండా, సర్వే నంబర్ 167లో ఏర్పాటు చేయడం వెనుక ఎవరి లాభాలు దాగి ఉన్నయో తెలియడం లేదు. ప్రభుత్వం సర్వే నంబర్ 167లోనే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామంటే కోహెడ రైతుల నుంచి పెద్ద ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ భూముల్లో చాలా ఏండ్లుగా సుమారు 150 మంది రైతు కుటుంబాలు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వం మార్కెట్ స్థలం మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.
– గంగని శ్రీనివాస్, కోహెడ