శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Sep 30, 2020 , 02:21:07

జోరుగా ఆన్‌లైన్‌ రమ్మీ

జోరుగా ఆన్‌లైన్‌ రమ్మీ

హుజూర్‌నగర్‌కు చెందిన రహీం సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడుతుండగా తన స్నేహితుడు యూసుఫ్‌  అడిగాడు.  డబ్బులు బాగా వస్తున్నాయని అతను చెప్పగా..  ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలని  ఫేక్‌ జీపీఎస్‌తో లాగిన్‌ అయ్యి ఆరు నెలలుగా రమ్మీ ఆడుతున్నాడు. గత నెలలో ఆటలో రూ.10 వేల వరకు పోవడంతో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడటం మంచిది కాదని యాప్‌ను తీసివేశాడు. 

హుజూర్‌నగర్‌  జిల్లాలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆట యథేచ్ఛగా కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉంటున్న యువత రమ్మీ ఆటకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని ఇంటర్‌నెట్‌ ద్వారా ఫేక్‌ జీపీఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రమ్మీ ఆడుతున్నారు. 

మన రాష్ట్రంలో రమ్మీ సర్కిల్‌ గేమ్‌కు అనుమతి లేదు. రమ్మీ సర్కిల్‌ యాప్‌ను ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు తప్ప డబ్బులు పెట్టి ఆడే అవకాశాలు లేవు. దీంతో కొందరు తమ మేధస్సుతో స్మార్ట్‌ ఫోన్‌లో ఫేక్‌ జీపీఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడుతున్నారు. ఫేక్‌ జీపీఎస్‌తో తెలంగాణ రాష్ట్రంలో లేనట్టుగా కనిపిస్తుండటంతో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడేందుకు మార్గం సులువైంది. 

ఆన్‌లైన్‌ రమ్మీ సర్కిల్‌లో ఫేక్‌ జీపీఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఓపెన్‌ చేయగానే మొబైల్‌ నెంబర్‌ అడుగుతుంది. ఓటీపీ వచ్చిన పిదప యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అనంతరం పాన్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ను అప్‌లోడ్‌ చేస్తే ఇక  పెట్టి ఆడవచ్చు. దీనికోసం కొందరు స్పీడ్‌గా వచ్చే ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆన్‌లైన్‌ రమ్మీలో గ్రూపులు...

ఆన్‌లైన్‌ రమ్మీలో ఒకరు ఆడితే డబ్బులు పోతాయనే విషయాన్ని గమనించిన కొందరు (ఈ ఆటలో ఆరితేరినవారు) యువకులను చేరదీసి వారికి కొంత డబ్బు ఇస్తూ వారి మొబైల్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేస్తున్నారు.  గేమ్‌ ఆడుతూ తమకు అవసరమయ్యే కార్డులను డౌన్‌లోడ్‌ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు వినికిడి. వీరు సంపాదిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మరికొందరు యువకులు వీరితో స్నేహం చేస్తూ ఆట నేర్చుకుంటున్నారు.

సైబర్‌ సెల్‌ ద్వారా ఆట కట్టడి..

అత్యాధునిక సైబర్‌ సెల్‌ ద్వారానే తెలంగాణ ప్రాంతంలో ఈ ఆట ఆడుతున్న వారి సమాచారం తెలుసుకుని చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఫేక్‌ జీపీఎస్‌ను వాడుతున్న వారి వివరాలను సాంకేతికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్‌లైన్‌ రమ్మీ ఆటతో తమ పిల్లలు వ్యసనాల బారిన పడుతున్నారని, రమ్మీ ఆడేవారిని పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.