Deepfakes | సమాచార స్రవంతిగా, కాలక్షేపానికి వేదికగా, సృజనాత్మకతకు భూమికగా వెలుగొందుతున్న సామాజిక మాధ్యమాల్లో పొంచి ఉన్న ప్రమాదాలెన్నో! హ్యాకింగ్, ట్రోలింగ్, ఇన్ఫ్లూయెన్స్ ఇలా రకరకాల జాడ్యాలు సోషల్ మీడియాను పట్టిపీడిస్తున్నాయి. డీప్‌ఫేక్స్ కూడా ఈ కోవకే చెందుతుంది. కృత్రిమ మేధను ఉపయోగించి నమ్మేలా చేస్తారు. అందినంత దోచుకొని నట్టేట ముంచుతారు. కొన్నిసార్లు మన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆన్లైన్లో అభాసుపాలు చేసే ప్రమాదమూ ఉంది. డీప్‌ఫేక్స్ ఎలా టార్గెట్ చేస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం..
ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు తనీశ్. అమెరికాలో ఉన్న బాస్ ఏదో అర్జెంట్ అసైన్మెంట్ ఇచ్చాడు. గంటలోగా అది పూర్తి చేయాలి. ట్రబుల్షూట్ చేస్తున్నాడు. ఇంతలో బాస్ నుంచి మెయిల్! కంగారుగానే ఓపెన్ చేశాడు. ‘మై కార్డ్స్ బ్లాక్డ్.. నీడ్ 2 లాక్స్ మనీ ఎమెర్జెన్సీ. ట్రాన్స్ఫర్ టు దిస్ నంబర్’ అని సందేశం. చూస్తే బాస్ మెయిల్ ఐడీతోనే వచ్చింది. పైగా కంపెనీ అఫీషియల్ డొమైనే ఉంది! అమెరికాలో బాస్ ఎంత అవసరంలో ఉన్నాడో అని.. మెయిల్లో సూచించిన నంబర్‌కు డబ్బులు పంపాడు తనీశ్. కాసేపటికి బాస్ ఇచ్చిన టాస్క్ కూడా పూర్తిచేశాడు. ‘గుడ్ జాబ్’ అని బాస్ నుంచి సందేశం. పొంగిపోయాడు తనీశ్. వారం గడిచింది. అమెరికా నుంచి బాస్ వచ్చాడు. టూర్ సక్సెస్ అయిందని ఆఫీస్ స్టాఫ్‌కు పార్టీ ఇచ్చాడు. తనీశ్ పనితనాన్ని మెచ్చుకున్నాడు. మంచి అప్రైజల్ కూడా ఇచ్చాడు. ‘అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఆ రెండు లక్షల ముచ్చట ఎత్తడేంటి?’ అని లోలోపల సతమతమవుతున్నాడు తనీశ్. ఒక వారం గడిచాక.. పర్సనల్‌గా వెళ్లి ‘సర్, యూఎస్ టూర్లో ఇబ్బందిపడ్డట్టున్నరు. మీరు అడిగిన సమయానికి నా దగ్గర డబ్బు ఉండటం, మీకు పంపడం సంతోషంగా ఉంది’ అన్నాడు. బాస్ ముఖం వివర్ణమైంది. ‘ఏ డబ్బులు’ అన్నాడు బాస్. తనీశ్ షాక్ అయ్యాడు. అంతలోనే తేరుకొని ‘అదేసార్, మీరు మెయిల్ పంపారు కదా! క్రెడిట్ కార్డ్స్ నాట్ వర్కింగ్.. రెండు లక్షలు పంపమ’ని మెయిల్ చేశారుగా. బాస్ ముఖం ఎర్రబడింది. ‘నేను మెయిల్ చేయడమేంటి..? ఏం మాట్లాడుతున్నవ్’ అని నిలదీసినంత పనిచేశాడు. మెయిల్ చూపించాడు తనీష్. అది పంపింది తను కాదని బాస్ తేల్చిచెప్పాడు. పోలీసులు ఆరాతీస్తే అది డీప్‌ఫేక్స్ మాయ అని తేలింది. లబోదిబోమనడం తనీశ్ వంతైంది.
ఒక్క తనీశ్ మాత్రమే కాదు.. ఇలాంటి డీప్‌ఫేక్స్ బాధితులు వేలల్లో ఉంటున్నారు. సోషల్ ఇంజినీరింగ్ నేరాల్లో దీని హవా నడుస్తున్నది. వాట్సాప్‌లో, ఫేస్
బుక్‌లో, ఇన్‌స్టాలో ఈ బెడద ఇటీవల పెరిగింది. ఫేస్బుక్ హ్యాక్ చేయడం, సదరు అకౌంట్లో ఉన్న ఫ్రెండ్స్‌కు డబ్బులు కావాలని సందేశాలు పంపి బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సీఈవో పేరుతో కంపెనీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరుతో రాజకీయ నాయకులు, కిందిస్థాయి ఉద్యోగుల దగ్గర దోచుకుంటున్నారు. అనుమానం రాకుండా అచ్చుగుద్దినట్టు వాళ్ల గళంతోనే వాయిస్ మెసేజ్‌లు కూడా పంపుతుండటం గమనార్హం. ఫేస్ మార్ఫింగ్‌తో అచ్చు వాళ్లలాగే కనిపిస్తూ కనికట్టు చేస్తున్నారు. పెద్దవారిగా పరిచయం చేసుకొని వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేసి, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తనకు కావాల్సినవాళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆర్థికంగా చేయూత ఇవ్వాలంటూ కోరుతున్నారు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల రూపంతో ఫేక్ వీడియో గానీ, ఆడియో గానీ రూపొందించి స్వార్థ ప్రయోజనాలకు వాడుతున్నారు. ఇవి నిజమని గుడ్డిగా నమ్మితే.. ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. ఒక్కోసారి మానసికంగా కుంగిపోయే ప్రమాదమూ ఉంది.
Deepfakes2
డీప్‌ఫేక్స్ నుంచి తప్పించుకోవడం సులభమే! కాస్త ఆలోచిస్తే చాలు.. డబ్బులు కావాలంటూ, ఎవరికో సాయం చేయమంటూ వచ్చే సందేశాలు, వీడియోల గుట్టు రట్టు చేయవచ్చు.
☞ అనుమానాస్పద వీడియో గానీ, కథనం గానీ వస్తే, ఎవరు పంపారు, సోర్స్ విశ్వసనీయత తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
☞ ఇంకోసోర్స్ ద్వారా వాటిలో నిజమెంతో నిర్ధారణ చేసుకోవాలి.
☞ సదరు వీడియోలో అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించాలి. అసహజంగా ఉండటం, పెదాల కదలికకు, మాటలకు పొంతన కుదరకపోవడం లాంటివి గుర్తించే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, వీడియోలో నీడలను బట్టి కూడా వాటి నిజానిజాలు తెలుస్తాయి.
☞ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. సబ్జెక్ట్‌కు, వెనక ఉండే బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధం లేకపోయినా అనుమానించాల్సిందే!
☞ ‘డీప్‌ఫేక్ డిటెక్షన్ మోడల్’ వంటి కొన్ని స్పెషల్ టూల్స్ ద్వారా వీడియో, కథనాల నిజానిజాల నిగ్గు తేల్చుకోవచ్చు.
☞ ఎప్పుడూ డబ్బు అడగని వ్యక్తి, అర్జెంట్‌గా మనీ కావాలి అనగానే, తొందరపడొద్దు. వాట్సాప్‌లోనో, మెసెంజర్లోనో పొంతన లేని కారణాలతో డబ్బు కావాలని అడిగితే.. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి నిజమో, కాదో నిర్ధారణ చేసుకోవాలి. ఏ పరిచయం లేని వ్యక్తి డొనేషన్ల పేరిట పంపే వీడియోలను పట్టించుకోకపోవడం ఉత్తమం.
☞ ఇతర వీడియోలు, కథనాల విషయంలో నిజానిజాలను బేరీజువేసే మార్గం ఉంది. https://www.boomlive.in/, <https://www.altnews.in/> వెబ్‌లింక్‌ల ద్వారాగానీ, అఫీషియల్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ సంస్థల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Influencers | ఏదైనా వస్తువు కొనేముందు ఆన్లైన్లో రివ్యూలు చదువుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?