PM Modi | హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్షంలో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని.. సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని పిలుపునిచ్చారు. స్పేస్ సెక్టార్లో కో ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకువచ్చామని.. జన్‌జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.
అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్‌లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయన్నారు. జన్‌జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్లోబల్ శాటిలైట్ వ్యవస్థలో భారత్ లీడర్‌గా మారనుందన్నారు. స్కైరూట్ లాంచింగ్‌తో యువతలో నమ్మకం పెరుగుతుందన్న ఆయన.. భారతీయ స్పేస్ సెక్టార్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రపంచంలో చిన్న శాటిలైట్లకు డిమాండ్ పెరిగిందని.. రాబోయే కాలంలో శాటిలైట్ ఎకానమీ భారీగా పెరుగుతుందన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో మాత్రమే అంతరిక్ష పరిజ్ఞానం ఉందని.. భారత శాటిలైట్లు తక్కువ ఖర్చుతో నమ్మదగినవని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు హాజరయ్యారు.
విక్రమ్-1 అనేది ఓ సాంకేతిక అద్భుతం. ఇది ఎర్త్ లో ఆర్బిట్‌కి దాదాపు 300 కిలోల పేలోడ్స్‌ను మోసుకు వెళ్లేలా రూపొందించారు. కార్బన్ ఫైబర్ బాడీతో తీర్చిదిద్దారు. విక్రమ్ సిరీస్‌కు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును పెట్టారు. భారత్ అవసరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన శాటిలైట్లను సైతం నింగిలోకి మోసుకువెళ్లే లక్ష్యంతో ఈ రాకెట్‌ను అభివృద్ధి చేశారు. విక్రమ్-1 రాకెట్‌కు బహుళ శాటిలైట్లను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. ఏ ప్రయోగ ప్రదేశం నుంచి అయినా 24 గంటల్లో దీన్ని సమీకరించి ప్రయోగించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. విక్రమ్ ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ పర్యావరణ వ్యవస్థలో దేశాన్ని భవిష్యత్ అగ్రస్థానంలో నిలుపుతుంది. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు, ఐఐటీ పూర్వ విద్యార్థులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ ఢాకా స్థాపించిన స్కైరూట్ 2022లో భారతదేశపు తొలి ప్రైవేట్ సబ్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విక్రమ్-ఎస్తో చరిత్ర సృష్టించారు.