NoraFatehi | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి, సంజయ్ దత్ జంటగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునార్’ పాటపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలోని అశ్లీల సాహిత్యంపై నెటిజన్లు, సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నోరా ఫతేహి స్పందిస్తూ.. తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ పాటను తాను మూడేళ్ల క్రితమే కన్నడ భాషలో షూట్ చేశానని, అప్పట్లో మేకర్స్ చెప్పిన అర్థం తనకు అభ్యంతరకరంగా ఏమీ అనిపించలేదని ఆమె వెల్లడించారు.
అయితే, ఈ పాటను హిందీలోకి డబ్బింగ్ చేసే సమయంలో సాహిత్యాన్ని మార్చేశారని, ఆ మార్పుల గురించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని నోరా ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ భాష రాకపోవడం వల్ల షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పిందే నమ్మానని, కానీ హిందీ వెర్షన్ విన్న తర్వాత అందులోని అసభ్యకర పదాలను చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. వెంటనే దీనిపై దర్శకుడికి ఫిర్యాదు చేయడమే కాకుండా, మహిళలను కించపరిచేలా ఉన్న ఆ పాట నుంచి తాను పూర్తిగా తప్పుకున్నానని, అందుకే ఎక్కడా ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తన అనుమతి లేకుండా తనపై, సంజయ్ దత్పై AI ద్వారా రూపొందించిన ఫోటోలను వాడటంపై ఆమె మండిపడ్డారు. ఈ అసభ్యకర పాటను వ్యతిరేకించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి తప్పులకు నటీనటులను కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే దర్శకులు, నిర్మాతలను ప్రశ్నించాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.