cyber blackmail | సుమతి (పేరు మార్చాం)కి ఉద్యోగం చేయాలనే కోరిక. తల్లిదండ్రులేమో డిగ్రీ కాగానే పెండ్లి చేస్తామంటున్నారు. ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకొని, ఇంట్లో ఒప్పించి, తను ఇష్టపడే పక్కింటి అబ్బాయిని పెండ్లి చేసుకోవాలని అనుకుంది సుమతి. ఫైనలియర్లో ఉండగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ వెబ్సైట్లో ఉద్యోగ ప్రకటన చూసింది. మంచి జీతం, తక్కువ పనిగంటలు, రెండు వీకెండ్ సెలవులు.. ఇంతకంటే బంపరాఫర్ రాదేమో అనుకున్నది. ఆ కంపెనీ యాప్ నుంచి లాగిన్ అయ్యింది. కుకీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడకుండానే యాక్సెప్ట్ చేసింది.
తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉన్న ఓ చెడ్డ అలవాటు వీడియోకాల్స్ చేయడం. ఓ రోజు రాత్రి ఇద్దరూ ఏకాంతంగా వీడియోకాల్ మాట్లాడుతున్న సమయంలో తను అప్లయ్ చేసిన కంపెనీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘కంగ్రాట్స్ మీరు ఎంపికయ్యారు. మీరు కోరుకున్న శాలరీ ఇచ్చేందుకు సంస్థ సిద్ధంగా ఉంది. ఉద్యోగంలో చేరాలనుకుంటే కింది లింక్ ఓపెన్ చేసి, ‘ఓకే’ ఆప్షన్‌తో అనుమతి తెలపండి. ఆఫర్ లెటర్ మీ అడ్రస్‌కు వస్తుంది’ అని ఉంది. తన ప్రియుణ్ని లైన్లోనే ఉంచి.. బ్లూ లింక్ ద్వారా తన అనుమతి తెలిపింది. ఆఫర్ లెటర్ కోసం ఎదురుచూస్తున్న సుమతి ఫోన్‌కు ఓ అపరిచిత నంబరు నుంచి వాట్సాప్ వీడియో వచ్చింది. ఓపెన్ చేస్తే.. తను స్నానం చేస్తూ ప్రియుడితో మాట్లాడిన ఘట్టం. ఆ వెంటనే
మరొకటి.. ప్రియుడితో ఏకాంతంగా వీడియోకాల్ మాట్లాడిన దృశ్యం. మొదట డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే తన ఫోన్లోని అన్ని కాంటాక్ట్స్‌కు వీడియోలు పంపుతామని బెదిరించాడు. భయపడి ఓ రెండు లక్షలు ఇచ్చింది. అదే అదునుగా తననూ కోరాడా బ్లాక్ మెయిలర్. రహస్యంగానే పోలీసులను సంప్రదించింది. ఖాకీలు వాడి భరతంపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా 495 కోట్లమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వీరిలో 462 కోట్లమంది (ప్రపంచ జనాభాలో 58.4 శాతం) సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. వీరిలో సైబర్ నేరాల బాధితులు సగానికి సగం. అందులో అమ్మాయిలే అధికం. ఫేస్బుక్ వీడియోల్లో ఇటీవల అమ్మాయిలు స్నానం చేస్తున్నవి, అర్ధనగ్నంగా, నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడుతున్నవీ..
రకరకాల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అలాంటి ఓ నాలుగైదు లింక్ చేసి, ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్నారు. అక్కడ కనిపించే వారిలో 90 శాతం సైబర్ ట్రాఫికింగ్ బాధితులే. ఏదో ఓ బలహీన క్షణంలో తమకు తెలియకుండా సైబర్ నేరగాళ్ల బారినపడినవారే. నేరగాళ్లంతా ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడతారు. స్మార్ట్ ఫోన్స్ ట్యాప్ చేసి, రహస్యంగా ట్రాక్ చేసి, వీడియోలు, ఫొటోలు దొంగలించి.. నెట్‌వర్క్‌లోని వారికి విక్రయిస్తుంటారు. ఫలితంగా తక్కువ మొత్తంలో మంచి వీడియోలు దొరకబట్టి.. తమ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ఖాతాలు, పోర్న్సైట్స్కు విక్రయిస్తుంటారు. కొందరు దొంగలు అమ్మాయిల అందాన్ని మోహించి.. నేరుగా లైంగికంగా వేధిస్తుంటారు. టీనేజర్స్‌ను టార్గెట్ చేసుకొని.. అందం, డబ్బులు, బహుమతులు, ఉద్యోగాలు అంటూ ట్రాప్‌లోకి తెచ్చుకుంటారు. మెల్లిగా నమ్మిస్తారు.. ఆ తర్వాత దారుణంగా వంచిస్తారు. సైబర్ ట్రాఫికింగ్ ఓ చీకటి ప్రపంచం. లైంగిక బానిసత్వం, అశ్లీలత, పిల్లల విక్రయాలు, అద్దె గర్భాలు, అవయవాల వ్యాపారం.. ఆన్లైన్లో జరిగే దందాలు ఈ పరిధిలోకే వస్తాయి. మాల్వేర్స్, కుకీస్, యాప్స్‌తో ఫోన్‌ను ట్రాక్ చేయడం, సంభాషణలు రహస్యంగా వినడం, ఫొటోలు, వీడియోలు దొంగిలించడం, ఫోన్ కెమెరాలను తమ అధీనంలోకి తీసుకోవడం, నకిలీ వెబ్సైట్ల ద్వారా లాగిన్ అయి వివరాలు సేకరించడం, బాధితులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు వసూలు చేయడం.. ఈ దందాలో భాగమే. తమకు దొరికిన కంటెంట్‌ను అందినకాడికి అమ్ముకొని, ఆ డబ్బును క్రిప్టోగా మార్చుకుంటున్నారు. నేరానికి పాల్పడినవాడు ఓ దేశంలో ఉంటే.. బాధితులు మరో దేశంలో ఉంటారు.
» మీరూ ఆ వలలో చిక్కుకొని ఉంటే బాధపడుతూ కూర్చోకండి. ఒకసారి డబ్బు డిమాండ్ చేసినవాడు.. మరోసారి అడగడని భరోసా ఏంటి? మీ వీడియోలు చీకటి మార్కెట్లో విక్రయించడని ఎలా నమ్ముతారు? కాబట్టి, ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించాలి.
» పోలీసులను ఆశ్రయిస్తే.. చట్టబద్ధంగా సంబంధిత సైట్లు, యాప్స్ నుంచి ఆ వీడియోలను తీయించే ఏర్పాటు జరుగుతుంది. నేరగాళ్లకు సరైన శిక్ష వేస్తారు.
» ఆన్లైన్లో సరికొత్త పరిచయాలకన్నా.. మీకు తెలిసిన వ్యక్తులతోనే మాట్లాడటం సురక్షితం.
» మీ టీనేజ్ పిల్లలపై, వారి ప్రవర్తనపై దృష్టి పెట్టండి. మితిమీరిన ‘స్మార్ట్’ స్వాతంత్య్రం ఇవ్వకండి.
» మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి రిక్వెస్ట్‌లు.. బ్లూ లింక్‌తో కూడిన ఫిషింగ్ మేసేజ్‌లు.. స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తుంటే.. మీరు సైబర్ దొంగల ట్రాకింగ్ లిస్ట్‌లో ఉన్నారని అర్థం. వాటికి స్పందిస్తే మాత్రం.. మీకు తెలియకుండానే మీపై నిఘా పెడతారు. నిలువునా ముంచేస్తారు.
» మీతో పరిచయం పెంచుకోవడానికి ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తున్న అపరిచితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ కవ్వింపు మాటలు, రెచ్చగొట్టే ఫొటోలకు స్పందిస్తే.. మీ పతనాన్ని మీరు ఆహ్వానించినట్లే.
» ఇప్పటికే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఉంటే, ఆర్థికంగా నష్టపోతూ ఉంటే.. ఆలస్యం చెయ్యకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యండి. లేదా https://cybercrime.gov.in/లో ఫిర్యాదు చెయ్యండి. బాధితుల హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చెయ్యండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త