Cyber Stalking | వ్యాపార అవసరాల కోసం ల్యాప్‌టాప్ కొన్నాడు సంపత్. తీరిక సమయాల్లో వీడియో గేమ్స్ ఆడేవాడు. బోర్‌కొడితే రొమాంటిక్ సినిమాలు చూసేవాడు. కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన వ్యాపార విశేషాలను సోషల్ మీడియాలో పంచుకునేవాడు. ఆఫీస్‌కే పరిమితమైన అతని ల్యాప్‌టాప్.. క్రమంగా బెడ్రూమ్లోకి వచ్చింది. పడక మీదినుంచే వ్యాపార వివరాలు నమోదు చేయడం, ఫోన్లో కస్టమర్లతో మాట్లాడటం, వెబ్‌క్యామ్‌తో వీడియోకాల్స్, మీటింగ్స్ పరిపాటిగా మారింది. ఓ రోజు రాత్రి ల్యాప్‌టాప్ ఆఫ్ చేయకుండానే పని మధ్యలో వదిలేసి.. భార్యతో ఏకాంతంగా గడిపాడు. ఆ మరుసటి రోజు అతని వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి కొన్ని వీడియోలు వచ్చాయి. తీరాచూస్తే.. భార్యతో తన శృంగార ఘట్టం. ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. అంతే, గుండెలు జారిపోయాయి. ఎలా జరిగిందో తెలియదు. అంతలోనే గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్. ఐదు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్. ఇవ్వకపోతే సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరింపు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు సంపత్. అంతటితో ఆగలేదు. ఇంకో మూడు లక్షలు కావాలంటూ మరో కాల్. చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌టెక్ విభాగం అధికారులు ల్యాప్‌టాప్‌ను చెక్ చేయడంతో ఓ మాల్వేర్ బయటపడింది. అతను రొమాంటిక్ వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు దీన్ని చొప్పించారు. ఆ చీకటి సాంకేతికతసాయంతో వెబ్‌క్యామ్‌ను స్వాధీనంలోకి తీసుకొని, ట్రాకింగ్ చేస్తూ.. ఏకాంతాన్ని కూడా వీడియో తీశారు. ఈ తతంగాన్ని ‘సైబర్ స్టాకింగ్’ అంటారు.
సోషల్ మీడియా వికృత కోణం.. సైబర్ స్టాకింగ్ ( Cyber Stalking ). ఈ మధ్య ఇలాంటి కేసులు బాగా నమోదవుతున్నాయి. నెటిజెన్ల బలాలు, బలహీనతలు తెలుసుకొని.. అందుకు తగినట్టుగా ఎరను సిద్ధం చేసి, అదును చూసి ఆగం చేస్తున్నారు సైబర్ దొంగలు. సోషల్ మీడియాలో ఉన్నవారిని పదేపదే ట్రాక్ చేయడం. టార్గెట్ చేసుకున్న వ్యక్తికి అన్వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లు చేయడం, మెసెంజర్ల నుంచి వాయిస్ మెసేజ్‌లు పంపడం, నిఘా పెట్టడం, వెబ్‌క్యామ్‌లు, ఫోన్ కెమెరాలు హైజాక్ చేయడం, జియోట్యాగింగ్ పేరుతో మన లొకేషన్
ట్రాక్ చేయడం, సోషల్ మీడియా ఖాతాలను రహస్యంగా పర్యవేక్షించడం.. ఆ వ్యక్తి పేరున కొత్త ఖాతాలు తెరిచి, అందమైన అమ్మాయిల ఫొటోలతో రిక్వెస్ట్‌లు పంపడం, డబ్బు వసూలు చేయడం.. ఇలాంటి చీకటి పనులన్నీ ‘సైబర్ స్టాకింగ్’ కిందికే వస్తాయి.
ఈ అంశాలకు సంబంధించి మీకు ఎక్కడ ఏ అనుమానం కలిగినా కచ్చితంగా జాగ్రత్తపడాలి. కనీసం అప్పటినుంచైనా ప్రతి సమాచారాన్నీ లోతుగా పరిశీలించిన తర్వాతే పోస్ట్ చేయాలి. బయోడేటాను వెంటనే మార్చుకోవాలి. ఫేస్బుక్ లాంటి వేదికల్లో తెలిసిన వారికి మాత్రమే ట్యాగ్ చేసేందుకు అనుమతి ఇవ్వండి. మీరు ప్రైవేట్‌గా ఉపయోగించే కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లో ఉన్న అన్ని అకౌంట్ల నుంచీ లాగాఫ్ అవ్వండి. అన్ని పాస్వర్డ్స్ మార్చేయండి. స్ట్రాంగ్‌గా ఉండే కొత్త పాస్వర్డ్లు ఎంచుకోండి. సోషల్ మీడియా కోసం పబ్లిక్, షేర్డ్ కంప్యూటర్లను ఉపయోగించొద్దు. మీ ఫోన్, ల్యాప్‌టాప్, పీసీలో థర్డ్‌పార్టీ యాప్స్‌ను తొలగించండి. మీతో ఆన్లైన్ వేదికగా పరిచయాలు పెంచుకోవాలనుకునే వారి ఐడీలను ‘గూగుల్ రివర్స్ ఇమేజ్’తో సరి చూసుకోండి. వాయిస్ చాట్‌కు బదులుగా మెసెంజర్ వీడియో చాట్ ఉపయోగించండి. మెయిల్ పాస్వర్డ్ మార్చడం కూడా మర్చిపోవద్దు. ఏవైనా యాప్‌లను డౌన్లోడ్ చేసేందుకు గూగుల్ ప్లే, ఆపిల్ యాప్స్టోర్లను మాత్రమే ఉపయోగించండి. పబ్లిక్ వైఫైలకు దూరంగా ఉండండి.
» మీకు వరుసగా అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్టులు వస్తున్నాయంటే మిమ్మల్ని, మీ సోషల్ మీడియా కార్యకలాపాలను సైబర్ దొంగలు పర్యవేక్షిస్తున్నారని మర్చిపోవద్దు.
» ఇప్పటికే సైబర్ స్టాకింగ్ బారినపడి.. వేధింపులకు గురవుతుంటే మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోండి. బదులుగా మీ కుటుంబసభ్యుల ఫోన్‌ను వాడండి.
» స్పై వేర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు సదరు ఫోన్/ల్యాప్‌టాప్‌ను పోలీసులకు అప్పగించండి. లేదంటే భద్రతా నిపుణులతో చెక్ చేయించండి.
» మీ సోషల్ మీడియా ఖాతాల్లో జరిగిన విధ్వంసాన్ని ఆధారాలతో సహా సేకరించండి.
» అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలను వెంటనే బ్లాక్ చేయండి. అవసరమైతే రిపోర్ట్ చేయండి.
» మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్ చేసుకోండి. అవసరమైతే ఏదైనా వస్తువుతో కవర్ చేయండి.
» మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇతర గ్యాడ్జెట్స్‌లో యాంటీ-వైరస్, యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోండి.
» అయినా, మీ సమస్య పరిష్కారం కాకపోతే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in/లో ఫిర్యాదు చేయండి. లేదంటే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త