Social Media Posts | కార్తిక్.. కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివాడు. కాలేజీ రోజుల నుంచీ ప్రతీది సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు తనకు. ఊరెళ్లినా, ఉద్యోగానికెళ్లినా అప్డేట్ ఉండాల్సిందే. తన కాబోయే భార్య శ్వేత కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. తొలినాళ్లలో కార్తిక్ అప్డేట్స్ చూసి మురిసిపోయేది. క్రమంగా ఆ వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. ఓ రోజు రాత్రి ఓపిక చేసుకొని అతని సోషల్ మీడియా ఖాతాలన్నీ చెక్ చేసింది. ఇంకేముంది, బండారం మొత్తం బయటపడింది. గర్ల్‌ఫ్రెండ్స్, మందు, విందు, తప్పతాగి చిందులు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ స్టేటస్ కార్తిక్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. సాక్ష్యాలు ముందుపెట్టి నిలదీసింది. మొదట తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె వినలేదు. పెద్దలతో మాట్లాడి పెండ్లి రద్దు చేసుకున్నది. దీంతో అతనిలోని మరో మనిషి బయటికొచ్చాడు. శ్వేత ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన సైట్లలో అప్లోడ్ చేయసాగాడు. తనో కాల్‌గర్ల్ అని ప్రచారం చేస్తూ.. ఆమె నంబర్ కూడా పోస్టు చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్వేత. ఖాకీలు రంగంలోకి దిగి.. ఆ కంత్రీని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత శ్వేత పోస్టులు, షేరింగ్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.
డిజిటల్ యుగంలో ఓ వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం పెద్ద పనేం కాదు. అందివచ్చిన సాంకేతికతతో ఎవరి డేటానైనా ఇట్టే పసిగడుతున్నారు. మన సోషల్ అలవాట్లను చూసే బ్యాంకులు లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. మన సోషల్ బ్యాక్‌గ్రౌండ్ సరిగా లేకపోతే.. నోటికాడికి వచ్చిన కూడు కూడా చేజారిపోతున్నది. మనకు తెలియకుండానే మన డిజిటల్ ఐడెంటిటీ, అలవాట్లు, ప్రవర్తన బేరీజు వేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. దీనివల్ల కొంత ఉపయోగం ఉన్నా.. అమాయకులను మోసం చెయ్యడానికి కూడా దోహదపడుతున్నది. సైబర్ దొంగలు మన ఇష్టాయిష్టాలు తెలుసుకొని.. గాలం వేస్తున్నారు. ఒంటరి జీవులకు మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టి ఈజీగా మాయ చేస్తున్నారు. సైబర్ దొంగల దగ్గర మన వేలిముద్రలు, ఐరిస్, ముఖాలు, రెటీనా, వాయిస్, సంతకం అన్నీ స్టోర్ అవుతున్నాయి. చివరికి వ్యక్తిగత ఐడీకార్డులు, మాగ్నెటిక్ కార్డులు, కీ, పాస్వర్డ్స్ కూడా.. తెలిసిపోతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమే వారికి ఉప్పందిస్తున్నాం. సోషల్ మీడియాలో ఏం పోస్టు చేస్తున్నాం? అది ఎంతవరకు దారితీస్తుంది? మనం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే విషయాలపై కొంచెం సోయి ఉంటే మంచిది.
➤ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందే ఆలోచించండి. కంటెంట్ ఎలాంటిదో గమనించండి. అది మీ వ్యక్తిగత సమాచారమైనా, తప్పుడు సమాచారమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
➤ ప్రతీది అప్డేట్ చెయ్యడం వల్ల మీరే నష్టపోతారు. మీ గురించి తెలియాల్సిన వారికి తెలిస్తే చాలు. ప్రపంచానికంతా తెలియాలనే రూలేం లేదు.
➤ మీకు తెలియని కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయొద్దు. షేర్ చేయాలనుకుంటే అది నిజమో కాదో.. www.factly.com, www.boomlive.inలో చెక్ చేయండి.
➤ మీ వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉండాలంటే పబ్లిక్, ప్రైవేట్ వైఫైలో ఓటీపీలతో లాగిన్ అవ్వొద్దు.
➤ ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు వీపీఎన్ ఉపయోగించండి. లేకపోతే టీఓఆర్, డక్‌డక్ గోగా వంటి బ్రౌజర్లను ఉపయోగించండి.
➤ వీలైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెసేజింగ్ అప్లికేషన్లు ఉపయోగించండి. గ్యాడ్జెట్స్, యాప్స్‌లో మీ డిఫాల్ట్ ఫాస్
వర్డ్‌లను మార్చండి.
➤ చిన్నప్పటినుంచే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్, ఇతర ఆన్లైన్ వ్యవహారాలు వద్దు. ఒకవేళ కావాలనుకుంటే మీరే వారిని గైడ్ చెయ్యండి. మంచి చెడులు వివరించండి. ఓ అడుగు ముందుకేసి పిల్లలకు టెక్ ఫ్రీ జోన్, స్క్రీన్ టైమ్ కేటాయించండి.
➤ ఎందుకంటే ఎదిగే పిల్లలనే సైబర్ నేరస్థులు లక్ష్యం చేసుకుంటున్నారు. అడల్ట్ కంటెంట్ పంపి.. తమ దారికి తెచ్చుకొని, తల్లిదండ్రుల డబ్బులు కొల్లగొడుతున్నారు.
➤ అందుకే తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! మీరు సైబర్ నేరగాళ్ల బారినపడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చెయ్యండి, సైబర్‌క్రైమ్స్ వెబ్సైట్లో, దగ్గర్లోని పోలీస్
స్టేషన్లో ఫిర్యాదు చెయ్యండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త
10 నిమిషాల ఆనందానికి 10 లక్షలు పొగొట్టుకున్నాడు.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!