Cyber Crime | శ్రీహరి.. ఓ ఎమ్మెన్సీలో ఎగ్జిక్యూటివ్. వయసు 35 ప్లస్. చాలా బిజీగా ఉంటాడు. లక్షల జీతం. సంపాదనంతా పెండ్లి కోసం దాచుకున్నాడు. అప్పటికే మంచి కారు ఉంది. ఈఎమ్ఐలో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేశాడు. కొవిడ్ కాలంలో వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో కొంత తీరిక దొరికింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తన ఫొటోలు అప్లోడ్ చేసేవాడు. కొన్నాళ్లకు ‘హే..:)’ అంటూ ఓ మెసేజ్. డీపీ చూస్తే అందమైన అమ్మాయి. వెంటనే ‘హూస్ దిస్?’ అంటూ రీప్లయ్ ఇచ్చాడు. తను ‘దిస్.. ప్రియాంక శర్మ. మోడల్ కమ్ టెక్కీ’ అంటూ పరిచయం చేసుకుంది. కొన్నాళ్లు స్నేహపూర్వకంగా మాట్లాడింది.
తను పక్కగల్లీలోనే ఉంటాననీ, కొన్నాళ్లుగా తనను గమనిస్తున్నాననీ చెప్పింది. ఓ రోజు తన ఇష్టాన్ని తెలియజేసింది. మరుక్షణం నుంచీ మాటల్లో కవ్వింపులు మొదలయ్యాయి. పిచ్చెక్కించే ఫొటోలతో అతణ్ని ఆకట్టుకుంది. ఓ రోజు ‘హే.. శ్రీహరీ నన్ను నగ్నంగా చూడాలనుకుంటున్నావా?’ అంటూ రెచ్చగొట్టింది. హరి నోటి నుంచి మాట రాలేదు. అంతలోనే, ప్రియ నుంచి వీడియోకాల్.. సంబరపడిపోతూ లిఫ్ట్ చేశాడు. ముఖం కనిపించకుండా.. నగ్నంగా మారింది ప్రియ. మాటల్లో పెడుతూ స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకుంది. ఆ విషయం తెలియకుండా జాగ్రత్తపడుతూ.. హరిని కూడా నగ్నంగా మారమంటూ రెచ్చగొట్టింది. ఆ ఊపులో దుస్తులన్నీ విప్పేశాడు. కాసేపు ఇద్దరూ ‘ఎమోషనల్’ అయ్యారు. సడన్‌గా కాల్ కట్ అయింది.
తన నగ్న వీడియోలు.. ఒక్కొక్కటిగా వాట్సాప్‌కు రావడం మొదలైంది. అంతలోనే ప్రియ నుంచి కాల్. ‘ఏంటిది? ప్రియా నేను నిన్ను నమ్మాను కదా?!’ అంటుండగానే ‘పది లక్షల రూపాయలు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తే.. ఆ వీడియోలు డిలీట్ చేస్తా’ అంటూ కరడుగట్టిన క్రిమినల్లా మాట్లాడింది ప్రియ. కాదని వేషాలు వేస్తే.. ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్‌కు పంపుతానంటూ హెచ్చరించింది. సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియోలు హల్చల్ చేస్తాయని బెదిరించింది. ఎవ్వరికీ చెప్పుకోలేక శ్రీహరి సరెండర్ అయ్యాడు. పది నిమిషాల ఆనందం కోసం.. రూ.పది లక్షలు సమర్పించుకున్నాడు.
డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా నుంచి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. వీటిలో డిజిటల్ రొమాన్స్ ఒకటి. ఈ వలలో ఆడ, మగ.. ఇద్దరూ సులభంగా పడిపోతున్నారు. వారిలో ఎక్కువమంది మధ్య వయస్కులు, బాగా చదువుకున్నవారు, మధ్యతరగతి వారే. ఇతర వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకుంటారు. బలహీనతను క్యాష్ చేసుకుని ఆర్థిక/లైంగిక దోపిడికి పాల్పడుతున్నారు. తెలియని నంబర్ నుంచి న్యూడ్ వీడియోకాల్ చెయ్యడం, అందమైన ఫొటోలు పెట్టడం, కవ్వించి మన వీడియోలు, ఆడియోలు రికార్డు చేసి డబ్బు వసూలు చేయడం.. వీళ్ల వ్యూహాలు. ‘గే’లు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి స్నేహితులుగా నటిస్తూ.. కుటుంబసభ్యులు అనారోగ్యంగా ఉన్నారని, వీసా సమస్యలు వస్తున్నాయని, గిఫ్ట్‌లు పంపుతున్నామని అబద్దాలు చెప్పి డబ్బులు దోచేస్తారు.
› తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, కాల్స్, మెసేజ్ రిక్వెస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆన్లైన్ చాటింగ్, డేటింగ్ ప్రయత్నించవద్దు.
› ఆన్లైన్ ద్వారా పరిచయం అయినవారికి ఎప్పుడూ డబ్బులు, వ్యక్తిగత వివరాలు పంపొద్దు.
› కొందరు ఆన్లైన్ పరిచయాలను ఆసరాగా చేసుకొని ప్రముఖుల కాంటాక్ట్స్ ఇవ్వమని అడుగుతారు. బయట కలుద్దామని, వీడియోకాల్స్ చేసుకుందామని ఒత్తిడి తెస్తారు.
› మీకు గుర్తు తెలియని ఖాతాల నుంచి ఇమేజ్‌లు వస్తే.. వాటిని https://www.tineye.com లేదా Google రివర్స్ ఇమేజ్ చెక్ (https://images.google.com)లో ఇమేజ్ సెర్చ్ చేయండి.
› ప్రియమైనవారితో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో పెట్టకపోవడమే మంచిది. ఒక్కోసారి స్కామర్లు వాటిని మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు.
› డిజిటల్ శృంగారం ఓ భద్రత లేని చర్య. మన భావోద్వేగాలతో మోసగాళ్లు ఆడుకునే ఆట. అలాంటి చర్యకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.
› ఇప్పటికే డిజిటల్ శృంగార బాధితులై ఉంటే, ఆ తరహా హెచ్చరికలు అందుతూ ఉంటే.. ఆలస్యం చెయ్యకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యండి. లేదా https://cybercrime.gov.in/లో ఫిర్యాదు చెయ్యండి. బాధితులు హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చెయ్యండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
“రెండో పెండ్లి చేసుకునే యువతులే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. జాగ్రత్త పడకపోతే అంతే !!”
“Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్‌కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి”
“నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి”
“అందమైన అమ్మాయి అడిగిందని కోటి ట్రాన్స్ఫర్ చేశాడు.. తీరా చూస్తే..”