Fake News | శ్రీధర్, సుందర్, నగేశ్ పక్కపక్క ఊళ్లలో ఉంటారు. కలిసి చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ల ఆఫీస్‌లకు పండుగకు ముందురోజు సెలవులిచ్చారు. ముగ్గురిలో శ్రీధర్‌కు అప్పటికే పెండ్లయ్యింది. సుందర్‌కు నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వివాహం. అప్పటికే కుటుంబాన్ని ఇంటికి పంపిన శ్రీధర్ దోస్తులతో కలిసి హైదాబాద్‌లో బస్సు ఎక్కాడు. ఐదుగంటల ప్రయాణం తర్వాత అర్ధరాత్రి బస్సు దిగారు. అంతా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో స్వెటర్లు వేసుకొని నడక సాగించారు. కొంతదూరం వెళ్లగానే ఎవరో కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. రక్తం ధారలై పారింది. ఆ గుంపులో ఓ పెద్దమనిషి. ‘అసలు ఈ దొంగలు ఎవరో తెలుసుకోండ్రా’ అని గట్టిగా అరిచాడు. దీంతో ఫోన్లైట్లు, టార్చ్ వేసి చూశారు.. ముగ్గురూ చుట్టుపక్కల గ్రామాల యువకులే అని తెలుసుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న శ్రీధర్, సుందర్, నగేశ్.. ముగ్గురినీ దవాఖానకు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీధర్, సుందర్ మరణించగా, ఒక్క నగేశ్ మాత్రం బతికి బట్టకట్టాడు. ఈ దుర్ఘటన వెనుక ఓ ఫేక్ మెసేజ్ ఉంది. ‘రాజస్థాన్ దొంగలు పగలు దుప్పట్లు, రగ్గులు అమ్ముతూ.. రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని కత్తులతో పొడిచి చంపుతున్నారు. వరుస చోరీలు వారిపనే. యువకులు రాత్రిళ్లు పహరా కాయాలి. అపరిచిత వ్యక్తుల్ని అడ్డుకోవాలి. అవసరమైతే ప్రాణాలు తీయాలి. మన గ్రామాలను కాపాడుకోవాలి’ అనేది ఆ ఫార్వర్డ్ మెసేజ్ సారాంశం. అలా ఓ నకిలీ వార్తను నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండానే అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు.
స్మార్ట్‌ఫోన్ ప్రభావం పెరిగిపోవడంతో.. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమైన వార్త అనే దుస్థితికి చేరుకున్నాం. అగ్నికి ఆజ్యం పోసే వార్తలను గుడ్డిగా షేర్ చేస్తున్నాం. ‘ఫార్వర్డ్ మెనీ టైమ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తున్నా.. ఫేక్ క్రైమ్ న్యూస్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఓ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నాడనీ, మనం ఆ వలలో పడకూడదనీ.. తెలుసుకోలేక పోతున్నాం. నకిలీ వార్తల వెనుక కుట్రలను అర్థం చేసుకొని.. ‘నిజమా? కాదా?’ అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇతరులకు షేర్ చేయడం ఉత్తమం.
– ఏదైనా ఓ సంచలన వార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రముఖ దినపత్రికలు, న్యూస్ చానెళ్లలో వచ్చిందో లేదో చెక్ చేయండి. సోషల్ మీడియా ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మకండి.
– జాబ్‌లు, ఫ్రీ సీట్లు, ఆడ్మిషన్ల పేరుతో అర్హులకు అందేలా ఫార్వర్డ్ చెయ్యమంటూ ఫేక్ న్యూస్ వస్తే.. ఒక నిమిషం ఆలోచించి.. యూఆర్ఎల్ చెక్ చేసి, నిజమో కాదో తనిఖీ చెయ్యండి.
– చాలామంది తమ వ్యక్తిగత నమ్మకాలకు, ఇష్టాయిష్టాలకు దగ్గరగా ఉన్న వార్తలను.. అచ్చంగా తమలానే ఆలోచించేవారికి పోస్ట్ చేస్తుంటారు.
– అవసరమైతే www.factly.com వంటి ఫ్యాక్ట్‌చెక్ ఏజెన్సీలను సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయంగా IFCN నెట్వర్క్ ఫ్యాక్ట్ చెకర్స్ నుంచి నిజాన్ని తెలుసుకోండి.
– మీరు ఓ నకిలీ వార్తను ఇతరులకు పంపే ముందు గూగుల్ రివర్స్ ఇమేజ్ చెక్ చేయండి. అందుకు https://images.google.com లేదా ఫొటో వెరిఫికేషన్ కోసం www.tineye.comను ఉపయోగించండి.
– వీడియో ధ్రువీకరణ కోసం YouTube డేటా వ్యూయర్‌ని ఉపయోగించవచ్చు.. https://citizenevidence.amnestyusa.org
– InVid బ్రౌజర్‌ను డౌన్లోడ్ చేసుకొని (http://www.invid-project.eu/toolsand-services/invid-verification-plugin) ఈ యూఆర్ఎల్ ద్వారా నిజ నిర్ధారణ చేసుకోండి.
వివిధ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను మీరు గుర్తిస్తే.. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసే వారిపై రిపోర్ట్ చేయవచ్చు. లేదంటే www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. మరింత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలి. దిగువ ఇచ్చిన లింక్‌లలో మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు.
ఫేస్బుక్: https://www.facebook.com/help/572838089565953
వాట్సాప్: https://faq.whatsapp.com/general/security-and-privacy/staying-safe-on-whatsapp/
యూట్యూబ్ : https://support.google.com/youtube/answer/2802027
ట్విట్టర్: https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet
ఇన్స్టాగ్రామ్: https://help.instagram.com/1735798276553028
లింక్డ్ఇన్: https://www.linkedin.com/help/linkedin/answer/37822/recognizing-and-reporting-spam-inappropriate-and-
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి