జహీరాబాద్, నవంబర్ 28 : గంజాయితో పట్టుబడిన నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. సంగారెడ్డి ఫస్టు క్లాస్ అడిషనల్ సేషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1లక్ష చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. మెదక్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ జె.హరి కిషన్ (J Hari Kishan) తెలిపిన వివరాల ప్రకారం.. 2021 ఫిబ్రవరిలో రాథోడ్ మోహన్, రాథోడ్ వెంకట్, కేతావత్ పాండు నాయక్, రాథోడ్ మోతిరామ్లపై జహీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదైంది. సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై హెచ్ఏ మోహన్ కుమార్, రమేష్ రెడ్డి వీరి నుంచి102 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
ఈ కేసును జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై ఎం.టి కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జయంతి నిందితులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమాన విధించారు.
గంజాయి నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ అభినందించారు.