మెదక్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్( Cyber Crime) డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ( DSP Chandra Bose ) మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్ వంటి సమస్యలపై వివరించి విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా జరిగే మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, ఇతర ఆన్లైన్ మోసాల గురించి ఉదాహరణలతో అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాను వినియోగించే సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవాలని, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను నమ్మకూడదని, ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిగ్గా వినియోగించుకోవాలని తెలిపారు.సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం , వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని వివరించారు.
అనంతరం సైబర్ నేరాల నివారణపై అవగాహన ప్రతిజ్ఞ చేయించి , అవగాహన పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిబ్బంది సతీష్, సయ్యద్, స్వప్న, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.