Nothing Phone 3a Lite | ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను మిడ్ రేంజ్‌లోనే అందిస్తున్నాయి. ఈ సెజ్మెంట్కు చెందిన ఫోన్లనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకనే కంపెనీలు కూడా ముందుగా ఈ సెజ్మెంట్కే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందులో భాగంగానే అనేక కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను ఈ రేంజ్లో లాంచ్ చేస్తున్నాయి. ధర కూడా తక్కువగానే ఉంటుండడం విశేషం. ఇక ఇదే కోవలో స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 3ఎ లైట్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
నథింగ్ ఫోన్ 3ఎ లైట్ స్మార్ట్ ఫోన్‌ను ఈ మధ్యే ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేశారు. కానీ భారత్‌లో మాత్రం ఇప్పుడే లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో 6.77 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్బుతమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్ డిస్ప్లేకు గాను సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కనుక సూర్య కాంతిలోనూ ఈ ఫోన్ డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5ను అందిస్తున్నారు. దీనికి గాను ఆండ్రాయిడ్ 16 ఓఎస్ కలిగిన నథింగ్ ఓఎస్ 4.0 అప్డేట్ జనవరిలో లభిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్ లను ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 3 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో పలు ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. వీటి సహాయంతో నోట్ టేకింగ్, ఫొటో ఎడిటింగ్ చాలా సులభతరం అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 20 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఐపీ 54 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
నథింగ్ ఫోన్ 3ఎ లైట్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.22,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినట్స్ తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో డిసెంబర్ 5 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్‌ను సైతం అందిస్తున్నారు. వన్ కార్డ్ లేదా ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.