TGSRTC | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ అందజేశారు. 45 రోజుల్లోగా తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలోగా ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామని ఆ నోటీస్‌లో హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్ బస్‌భవన్ వద్ద జరిగిన సమావేశంలో కార్మిక జేఏసీ నేతలు మాట్లాడారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణలు చేపట్టాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నోటీస్ ఇచ్చామని ప్రకటించారు.
ఆయా సమస్యల పరిషారం కోరుతూ ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేక విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 2017 వేతన సవరణ ఏరియర్స్ నేటివరకు చెల్లించలేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న విమర్శించారు. ఆ వేతన సవరణలో జరుగాల్సిన అలవెన్స్‌లు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పాత అలవెన్సులే ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులకు ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. 2017లో రిటైరైన కార్మికులకు ఫిక్సేషన్లు జరిగినా, నేటివరకు వారికి సెటిల్మెంట్ చేయలేదని తెలిపారు. 2021 వేతన సవరణలో 30 శాతం ఫిట్మెంట్తో ఆర్టీసీ కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు నాడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, అదే విషయాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారని, దానిని ఎందుకు అమలు చేయడం లేదని జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకుంటున్నా కూడా విలీన ప్రక్రియ నేటివరకు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ హామీ నేటికీ నెరవేరకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొన్నదని తెలిపారు. విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగి చనిపోతే బ్రెడ్ విన్నర్ సీమ్ కింద కన్సాలిడేటెడ్ బేసిస్‌లో కారుణ్య నియామకాలు చేపట్టడం అత్యంత దురదృష్టకరమని కన్వీనర్ ఎండీ మౌలానా పేర్కొన్నారు. సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీలో ఈ సీమ్ కింద చేసే నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన ఉండాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు లేకపోవడంతో కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఎకువయ్యాయని, అధికారులు పనిభారాన్ని పెంచి కార్మికుల నడ్డి విరుస్తున్నారని కో కన్వీనర్ కే యాదయ్య విమర్శించారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను రెస్టోర్ చేస్తూ, చట్టప్రకారం ఎన్నికలు జరుపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్నని, చాపకింద నీరులా ప్రైవేటీకరణకు దారి తీస్తున్నదని కో కన్వీనర్ ఎస్ సురేశ్ ఆరోపించారు. ఇప్పటికే 850 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో చేరాయని, మరో 3,850 బస్సులను ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తున్నట్టు సీఎం ఇటీవల చెప్పారని గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీకి అందజేయాలని డిమాండ్ చేశారు.
మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారని కో కన్వీనర్ బీ యాదగిరి తెలిపారు. ఈ పథకంలో పలుచోట్ల ప్రయాణికులు దాడులు, ఫిర్యాదులు చేస్తున్నా.. డ్రైవర్లు, కండక్టర్లు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. అయినా ఈ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కార్మికులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వం నెలవారీగా ఇవ్వాల్సిన రూ.360 కోట్లను క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పథకంలో మహిళా ప్రయాణికులకు టికెట్ లెస్ స్మార్ట్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది కార్మికులు ‘సమ్మెకు సిద్ధం సిద్ధం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.