Nagaraju Gurrala : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడిని దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల(Nagaraju Gurrala) ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి హింసాత్మక చర్యలు అసహనానికి, అసహన రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభిప్రాయ భేదాలు, రాజకీయ విభేదాలు సహజం అయినప్పటికీ.. వాటిని హింస, దాడులు, ధ్వంసం వంటి మార్గాల ద్వారా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ధ్వజమెత్తారు.
‘ప్రజాస్వామ్యం అనేది పరస్పర గౌరవం, సహనం, చట్టపరమైన విధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల వంటి గౌరవనీయ నాయకులపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరం. ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తిపై దాడిగా కాకుండా, ప్రజాస్వామ్య విలువలపై దాడిగా కూడా పరిగణించాల’ని నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలంపై దాడి వెనుక ఉన్న వారిని వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నానని నాగరాజు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.