Mahesh Bigala : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ స్థాపక అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు (KCR) క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన అత్యంత దురదృష్టకరమైనదని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు మహేష్ బిగాల అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన ఈ దాడిని మీడియా ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇటీవల గజ్వేల్ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతల సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి అద్దాలను పగులగొట్టిన ఘటనను ఉపేక్షించరాదని మహేశ్ బిగాల అన్నారు.. పూల కుండీలను చిందరవందర చేయడం.. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ అధినేత క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడం వంటి చర్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయని,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యుల తరఫున ఈ ఘటనను ఖండిస్తున్నానని మహేశ్ బిగాల తెలిపారు. రాజకీయ విభేదాలు ఉంటే అవి చర్చల ద్వారా, చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలిగానీ, హింసాత్మక చర్యల ద్వారా కాదని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని, అలాగే గజ్వేల్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు సూచించారు. కాంగ్రెస్ దాడుల నేపథ్యంల ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన పోలీసులకు, అధికారులకు విజ్ఞప్తి చేసిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.