చింగ్ చా… చింగ్ చా.. మగ్గం ఆడించేటప్పుడు వినిపించే శబ్దం ఇది. ఆ నాదాన్ని వింటూ ఎదిగిన నేతగాడు కందగట్ల నర్సింలు. నూలు వడకడం నుంచి నేయడం దాకా, కండెలు చుట్టడం నుంచి రంగులు అద్దడం వరకు తండ్రి దగ్గర ఒడిసిపట్టేశాడు. నిజాం ఉద్యోగుల మన్ననలు అందుకున్న తాత సాంబయ్య పనితనం ఈ మనవడికి స్ఫూర్తి. మగ్గంపై తండ్రి నాగయ్య చేసే విన్యాసాలు చూస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించాడు. తాతల జమానాలో చెలామణిలో ఉన్న పొట్టి చీరలను ఈ తరానికి పరిచయం చేస్తున్నాడు నర్సింలు. ప్రాచీన కాలపు దుస్తుల తయారీ తీరుతెన్నులను పరిశోధించి, ఆకళింపు చేసుకొని.. ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. పొట్టి చీరలు నేయడంలో దిట్ట అనిపించుకున్నాడు. లక్షన్నర రంగులతో చీర నేసి కళపై తనకున్న పట్టు నిరూపించుకున్నాడు. వేలాది మందికి నేత పనిలో శిక్షణ ఇచ్చాడు. నిరంతర పరిశోధన, సమాంతర శిక్షణతో పడుగూపేకలా సాగిపోతున్న నర్సింలు ప్రస్థానం ఆయన మాటల్లో..
‘మా తాత సాంబయ్య నల్లగొండ జిల్లాలోని వలిగొండ ప్రాంతం వాడు. పనుల్లేక వరంగల్‌కి పోయిండు. అక్కడ దారం మిల్లులో కొలువు చేసిండు. ఆడి నుంచి హైదరాబాద్ ఒచ్చిండు. మగ్గాలు పెట్టుకుని చేనేత పని మొదలుపెట్టిండు. నిజాం పోలీస్ పటకాలు, సుబయ్యాలు, మేజోళ్లు, లుంగీలు, మైరుమాళ్లు, తేలియా రుమాళ్లు నేసేవాడు. సహజ సిద్ధమైన రంగులతో అందమైన వస్ర్తాల నేయడంలో మా తాత సిద్ధహస్తుడు. ఆ నైపుణ్యాలను తాత నుంచి మా నాన్న నాగయ్య నేర్చుకున్నడు. నాన్నని అడిగి, విసిగిస్తూ నేను నేర్చిన. రంగులు అద్దడంలో పూర్వం చేనేత వృత్తికారుల నైపుణ్యాలను నాన్న నుంచి తెలుసుకున్నాను.
గోల్కొండ వైభవం!
పెద్దయ్యాక మగ్గం మీదికి ఎక్కాను. 33 ఏండ్ల కిందట నా చేతికి మగ్గం వచ్చింది. అప్పటి నుంచి మగ్గం మీద ఏం చేయొచ్చు. ఎలా చేయొచ్చని ఆలోచిస్తూనే ఉండేవాడిని. ఇండోనేషియాలోని బాలీలో చిట్కీ లుంగీలు కట్టుకుంటరు. పాతబస్తీ ముస్లింలు ఆ డిజైన్లను ఇష్టపడేటోళ్లు. వాళ్ల కోసం ఎప్పటి నుంచో చిట్కీ లుంగీలు నేస్తున్నాం. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినం. గోల్కొండ కోటకు సమీపంలోని గుడిమల్కాపూర్‌లో స్థిరపడ్డాం. నాలుగు దశాబ్దాల కిందట.. మా ఇంట్లో పన్నెండు మగ్గాలు నడుస్తుండే. భారత ప్రభుత్వం చేనేత కార్మికుల నైపుణ్యాభివృద్ధి కోసం కార్వాన్లో ‘వీవర్స్ సర్వీస్ సెంటర్’ మొదలుపెట్టింది. చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు నా సాయం అడిగింది. అందులో ఉద్యోగిగా చేరాను. ‘ఆక్యుపేషనల్ అటెండెంట్ వీవింగ్ అండ్ డైయింగ్’ ఉద్యోగిగా చేరిన. చేనేత, రంగుల అద్దకంలో శిక్షణ ఇచ్చిన. ప్రాచీన కాలపు దుస్తుల ఆధారంగా ఏ రంగులు ఎలా కలపాలి? ఆ రంగుల్ని ఎలా అద్దాలో వీవర్స్‌కి నేర్పాను. వేలమందికి శిక్షణ ఇచ్చిన.
చిట్టి పిల్లలు.. పొట్టి చీరలు!
పెండ్లి పీటల మీద చీరకట్టులోనే కూర్చోవాలి. పెండ్లి చీర జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం కూడా. అందుకే అది అందంగా ఉండాలని కట్టుకునేవాళ్లే కాదు పుట్టింటి వాళ్లు, అత్తింటివాళ్లూ కోరుకుంటారు. అందరి కోరికకు తగ్గట్టు మా పద్మశాలీలు అద్భుతమైన అలంకారాలతో పెండ్లి చీరలు నేసేవాళ్లు. ఒకనాడు మన దేశంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. చిన్న పిల్లల ఎత్తుకు తగ్గ చీర కట్టకపోతే అది అందమివ్వదు. కాబట్టి తక్కువ పన్నాతో తక్కువ పొడవుతో పిల్లలకు తగ్గట్టే చీరలు నేసేవాళ్లు. అవి చుట్టుకోవడానికి, నడవడానికి అనువుగా ఉంటాయి. పెండ్లి తర్వాత చీరకట్టే జీవితం. కాబట్టి రోజువారీ ధరించేందుకు కూడా చిన్న పిల్లల కోసం సాధారణ చీరలనూ నేసేవాళ్లు. బాల్య వివాహాలు కనుమరుగైపోవడంతో పొట్టి చీరలూ కనపడకుండాపోయాయి. మా నాన్న చిన్న పిల్లల కోసం ఇరవై నాలుగు ఇంచుల పన్నాతో మూడున్నర మీటర్ల పొడవు చీర మగ్గం మీద నేయడం చూశాను. ఆ రోజుల్లో కండెలు చుట్టడం, నాన్నకు సాయపడుతూ ఉండేవాడిని. కానీ, నేత నేయలేదు. అయినా మగ్గంపై నేత విధానం, నాన్న నైపుణ్యం దగ్గరగా చూస్తూ కనిపెట్టాను. కనుమరుగైన ఈ నైపుణ్యం అంతరించకుండా ఉండాలని చిన్న చీరలు నేత నేశాను. ఆ చీరలు మా మనుమరాలు కట్టింది. కూచిపూడి, భరతనాట్యం చేసేవాళ్లు పెద్దవాళ్ల చీరలు ధరించలేరు. నేర్చుకునేవాళ్లు, ప్రదర్శన ఇచ్చేవాళ్లు చిన్న చీరలు కావాలని నా దగ్గరకు వచ్చారు. వాళ్ల కోసం డబుల్ ఇక్కత్ డిజైన్లతో మగ్గంపై పొట్టి పట్టు చీరల నేశాను. పిల్లల్లోనూ పొట్టి వాళ్లు, పొడుగువాళ్లుంటారు. మరీ చిన్న వయసు వాళ్లుంటారు. ఇలా ఎత్తుకు తగ్గట్టుగా మూడు రకాల సైజుల్లో పొట్టి చీరలను మగ్గం మీద నేశాను. మన చేనేతకు ఉన్న నైపుణ్యం అంతరించిపోకూడదని ఈ ప్రయత్నం చేస్తూ ఆ సాంకేతికతను నిలబెట్టాను.
ఒకే చీరపై వేల వర్ణాలు!
‘మగ్గం మీద నేతపై ఏ రూపమైనా రాబట్టడం సాధ్యమే’ అని చెప్పేందుకు 30 ఏండ్ల నుంచీ ప్రయోగాలు కొనసాగిస్తున్నా. వస్త్రంలో మార్పు రావాలంటే మగ్గం మీద మార్పులు చేయాలి. నేత నేసే పద్ధతిలోనూ మార్పులు చేసుకోవాలి. ఇవన్నీ నేను చిన్నప్పుడు నేయలేదు. కానీ, మా నాన్న చేస్తుంటే చూసానంతే. అవన్నీ గుర్తు చేసుకుని, కొన్ని అధ్యయనం చేసి ప్రయోగాలు చేశాను. పొట్టి చీరను అద్భుతంగా చేశాను. దేశంలో అనేక చేనేత సంప్రదాయాలున్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మన ప్రత్యేకతలు మనకున్నాయి. కానీ, అవి అంతరించాయి. వాటికి పూర్వ వైభవం తేవాలనిపించింది. సొంత డబ్బుతో సొంత ఆలోచనలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. కొన్ని ఫెయిల్ అయ్యాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి. నా భార్య బాలామణి, మా తమ్ముళ్లు సత్యనారాయణ, అశోక్ సహకారంతో మగ్గం మీద ఎన్నో ఆవిష్కరణలు చేశాను. ప్రపంచంలో ఏ చేనేత కళాకారుడూ నేయనన్ని రంగులతో చీర చేసిన. పడుగు పేకపై కొద్ది కొద్దిగా రంగులద్దుతూ 1,52,076 రంగులతో అద్భుతమైన చీర తీర్చిదిద్దిన. అడ్డు నిలువు రంగుల దారాల కలయికతో కొత్త కొత్త రంగులు సృష్టిస్తూ కలర్ కార్డ్స్ తయారు చేశాను. జ్యామితీయ రూపాలను రూపొందించుకుని, దానిని మగ్గం మీదకు తీసుకువచ్చేందుకు పడుగు, పేకలు రూపొందించుకుని ఎన్నో చిత్రాలు ఆవిష్కరించాను. చేనేత వస్త్రంపై నేసిన ఒబామా చిత్రం అమెరికా అధ్యక్ష భవనానికి చేరింది. రైతు పంట నుంచి పత్తి వస్త్రంగా మారే ప్రక్రియలోని దశలన్నీ చూపిస్తూ ‘తెలంగాణ చేనేత గ్రామం’ ఒకే వస్త్రంపై ఆవిష్కరించాను. మగ్గంపై చేసిన ఈ ఆవిష్కరణకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.
లోకం చూడని చీర!
మా నాన్న భారతీయ చేనేత విశేషాలు ఎన్నో చెప్పాడు. కనుమరుగైన ఆ కళను పునరుజ్జీవింపజేయడం కోసం ఆవిష్కరణలు చేస్తున్నాను. పీతాంబరం మన చేనేత వైభవం. శతాబ్దాల క్రితం పీతాంబరం కడితే గొప్ప. రెండు శతాబ్దాల నాటి పీతాంబరం చీరను సేకరించి అధ్యయనం చేశాను. దాని కోసం కొత్త మగ్గం తయారు చేశాను. పీతాంబరం నేసేందుకు సాంకేతికను అభివృద్ధి చేశాను. పీతాంబరం చీర నేసి… ఇతరులకు మార్గదర్శనం చేశాను. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ చేయని రెండు వైపుల వేర్వేరు రంగుల, వేర్వేరు డిజైన్లు వచ్చే వస్త్రం మగ్గంపై ఆవిష్కరించాను. రెండు పొరలుగా నేసే ఈ వస్త్రంలో పై పొర (వస్త్రం) మాత్రమే కంటికి కనిపిస్తుంది. కింది పొర కనిపించకుండానే అందమైన డిజైన్ వచ్చేలా వేశాను. చేనేత కళలో ఇదొక ఆవిష్కరణే కాదు, అద్భుతం కూడా! వీటిని చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసించాయి, సన్మానించాయి. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ చేనేత కళాకారుడి అవార్డుని రాష్ర్టావతరణ ప్రథమ వార్షిక వేడుకల్లో ప్రదానం చేసింది. డెనిమ్‌పై, పట్టుపై కూడా ఎన్నో ప్రయోగాలు చేశాను. పొట్టి చీరను ఇంతకు ముందు చూశారు. ఇప్పుడు పొడుగు చీరపై ప్రయోగం చేస్తున్నాను. చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని, వినని చీర త్వరలోనే మీకందరికీ చూపిస్తాను. మన చేనేత వైభవాన్ని చాటుతాను.
‘చేనేత నా వారసత్వం. నా వారసత్వం కోసం నేను నిలబడ్డాను. నా గురించి నేను చెప్పుకొంటున్నాను. డబ్బు కోసం, బతుకుదెరువు కోసం కాకుండా కొత్త ఆవిష్కరణల కోసం చేనేతలో ప్రయోగాలు చేశాను. ఎంతో డబ్బు ఈ ఆవిష్కరణల కోసం ధారపోశాను. ఎన్నడూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. ఎక్కడా యాచించలేదు. సొంత డబ్బు ఖర్చు చేశాను. కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేశాను. ’
– కందగట్ల నర్సింలు
-రాహుల్