ఇంటర్ విద్యార్థుల చేతుల్లో పాకెట్ మనీ ఉంటే చాలామంది దాన్ని వినోదం కోసం ఖర్చు చేస్తారు. కానీ, కల్వకుర్తికి చెందిన హేమంత్ చింతోజు మాత్రం అదే డబ్బుతో వైర్లు, మోటార్లు, సెన్సార్లు, బ్యాటరీలు కొనుగోలు చేస్తాడు. రైతులకు వ్యవసాయంలో సాయమందించేందుకూ, పేదలు కూడా ఇన్వర్టర్ వాడుకునేందుకూ, ఎండవేళ పోలీసులకు చల్లని నీడనందించేందుకూ… ఇలా సమాజానికి ఉపయోగపడేలా రకరకాల ఆవిష్కరణలు చేస్తుంటాడు. అన్నీ కేవలం వందల రూపాయల్లోనే తయారు చేయడం ఇతని ప్రత్యేకత.
పెద్ద కంపెనీల ల్యాబ్‌లు, ఆధునిక పరికరాలు, లక్షల రూపాయల పెట్టుబడులు ఉంటేనే ఆవిష్కరణలు చేయగలం అనుకుంటారు కొందరు. కానీ, ఇవేవీ లేకపోయినా అందుబాటులో ఉన్న సామగ్రితో సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేయవచ్చని నిరూపిస్తున్నాడు యువ గ్రామీణ ఇన్నోవేటర్ హేమంత్. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఇతను ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంజినీరింగ్ చదవకముందే చిన్నచిన్న యంత్రాలను రూపొందిస్తూ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల్ని
పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇంట్లో పనికిరాకుండా ఉన్న ఆయిల్ డబ్బాను వాడి, రూ.300 నుంచి రూ.400లో ఓ కూలర్‌ను తయారుచేశాడు. గ్రామాల్లో విద్యుత్ సమస్యను దృష్టిలో పెట్టుకుని 12 వోల్ట్ ఇన్వర్టర్ను రూపొందించాడు. ఇన్వర్టర్ బోర్డు, బ్యాటరీ, సాకెట్లు, స్విచ్‌లు, పీవీసీ పైపులతో తయారైన ఈ పరికరం రూ.1,300లోపు ఖర్చుతో పూర్తయింది. అత్యవసర పరిస్థితుల్లో చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్‌ను అందిస్తుంది.
సాగులో డీజిల్ యంత్రాల వినియోగం పెరుగుతున్న తరుణంలో రైతుల ఖర్చు తగ్గించాలని హేమంత్ ఆలోచించాడు. ‘రీచార్జబుల్ ఎలక్ట్రిక్ హార్వెస్టింగ్ మెషిన్’ తయారు చేశాడు. దీనితో గడ్డి కోయడం, చిన్న మొక్కల్ని తొలగించడం, పండ్లు కోయడం వంటి పనులు చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు నుంచి నాలుగు గంటల వరకు పనిచేస్తుంది. మోటార్, బ్యాటరీ, బ్లేడ్ స్విచ్ సహాయంతో కేవలం రూ.600లో దీనిని తయారు చేశానన్నాడు హేమంత్. తక్కువ ఖర్చుతో రైతులకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలు అందించాలన్న ఆలోచన ఈ ప్రయోగం వెనుక ఉంది. వీటితో పాటు, చెత్తను దగ్గరికి తీసుకు వెళితే అల్ట్రాసోనిక్ సెన్సర్ ద్వారా గుర్తించి మూత ఆటోమేటిక్‌గా తెరుచుకునే డస్ట్‌బిన్‌ను కేవలం రూ.550 ఖర్చుతో తీర్చిదిద్దాడు.
ఎండాకాలంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా విధుల్లో పోలీసు సిబ్బంది గంటల తరబడి నిలబడి పనిచేస్తుంటారు. వారి ఇబ్బందులను గమనించిన హేమంత్ వారికి ఉపయోగపడేలా ఏసీ టోపీ రూపొందించాడు. సీపీయూ కూలింగ్ ఫ్యాన్లు, బ్యాటరీ, స్విచ్‌లతో తయారైన ఈ టోపీ ధర సుమారు రూ.250 మాత్రమే. ఈ టోపీలను కల్వకుర్తిలోని పోలీసు సిబ్బందికి అందజేయడం ద్వారా తన ఆవిష్కరణను సమాజానికి అంకితం చేశాడు. ఇక, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జెండా ఎరుగవేసే కార్యక్రమానికి కొంత టెక్నాలజీని జోడించి మరింత ఆకర్షణీయంగా మార్చాలనే ఆలోచనతో హేమంత్ ఎలక్ట్రిక్ ఫ్లాగ్ సిస్టమ్ రూపొందించాడు. అతని లక్ష్యం కేవలం సైన్స్ ఎగ్జిబిషన్లో బహుమతులు గెలవడం కాదు. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను గమనించి వాటికి తక్కువ ఖర్చుతో పరిష్కారాలు అందించడమే. ఇక, తన ఆసక్తిని గుర్తించి ప్రతి అడుగులోనూ తన తండ్రి చింతోజు శేఖర్ చారి ప్రోత్సాహం అందించారని కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటాడు. చాలా మంది యువత సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్న సమయంలో, హేమంత్ మాత్రం అదే సమయాన్ని సర్క్యూట్లు రూపొందించడంలో, యంత్రాలను పరీక్షించడంలో, కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వెచ్చిస్తుండటం నిజంగా స్ఫూర్తిదాయకం.
“చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడం, ఏదో ఒకటి తయారు చేయడం ఎంతో ఆసక్తి. ప్రస్తుతం ప్రజల భద్రతకు ఉపయోగపడే సేఫ్టీ గ్యాడ్జెట్ల రూపకల్పన చేస్తున్నా. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, సాంకేతిక సహకారం లభిస్తే తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తా. నా జీవిత లక్ష్యం కేవలం ఇంజనీర్ కావడం మాత్రమే కాదు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త పరికరాలను రూపొందించి, వాటిని మార్కెట్లోకి తీసుకురావాలి. ‘భారతదేశంలో తయారైన ఉపయోగకరమైన ఆవిష్కరణ’ అని ప్రజలు గర్వంగా చెప్పుకునే ఉత్పత్తులను రూపొందించడమే నా కల.”
– శ్యాంమోహన్ 9440595858