KTR | నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ నేల, స్థానిక యాస, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలిన పాత్రను ప్రియదర్శి పోషించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ పాత్రపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ‘ది ప్యారడైజ్’ సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ చిత్రంపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ప్రజలు తమ అస్తిత్వం కోసం ఎలా పోరాడతారు? న్యాయం కోసం ఎలా గళమెత్తుతారు? అనే అంశాలను సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రభావవంతంగా చూపించారని కేటీఆర్ అన్నారు. అణచివేతకు గురైన ప్రజల తరఫున ఒక నాయకుడు నిలబడి, వారిని ముందుండి ఎలా నడిపిస్తాడనే అంశాన్ని ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించారని ప్రశంసించారు. తెలంగాణ నేల నేపథ్యంలో సహజమైన తెలంగాణ యాస, భాషతో రూపొందిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా సాగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అణచివేతకు గురైనప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో సినిమాలో చూపించారని, సమాజానికి ఒక సందేశాన్ని అందించేలా ఈ కథ ఉందని అన్నారు. సినిమాలో చూపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అది ఇప్పటికే అందరికీ అర్థమైందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి.
ఇక సామాజిక మాధ్యమం వేదికగా కూడా కేటీఆర్ ‘ది ప్యారడైజ్’పై స్పందించారు. అస్తిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటం వంటి అంశాలను సినిమాలో బలంగా చూపించిన శ్రీకాంత్ ఓదెలకు అభినందనలు తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారతాయనే సందేశాన్ని దర్శకుడు ఇచ్చారని పేర్కొన్నారు. నాని నటనను కూడా కేటీఆర్ ప్రశంసించారు. కథానాయకుడి పాత్రలో జీవించిన తన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రియదర్శికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!’ అనే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. ‘అదే ఎవరో మీకు తెలుసు’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
— KTR (@KTRBRS) September 26, 2026