Akhil | అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమాతో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న అఖిల్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తన పౌరసత్వంపై తొలిసారిగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను అమెరికా పౌరుడినేనని, అయితే త్వరలోనే భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ జోస్ నగరంలో జన్మించారు. అక్కడి చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించిన కారణంగా ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం ఆయన వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే చిన్నప్పటి నుంచే భారతదేశంలో పెరిగిన అఖిల్ తన విద్యలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. అనంతరం ఆస్ట్రేలియాలో చదివి, నటనపై ఆసక్తితో అమెరికాలోని న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. అయితే తాజా ఇంటర్వ్యూలో “మీరు అమెరికన్ సిటిజనా? లేక ఇండియన్ సిటిజనా?” అనే ప్రశ్నకు అఖిల్ ఆసక్తికరంగా స్పందించారు. “ప్రస్తుతం నేను అమెరికా పౌరుడిని. నా దగ్గర అమెరికా పాస్‌పోర్ట్ ఉంది. అయితే ఆ పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియలో ఉన్నాను.
ఇంకొన్ని నెలల్లో పూర్తిగా భారతీయ పౌరుడిని అవుతాను. ఏ దేశం పౌరసత్వం ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ భారతదేశానిదే. నేను ఇండియన్… మేరా భారత్ మహాన్” అంటూ తన దేశభక్తిని వ్యక్తం చేశారు.అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తూ స్పందిస్తున్నారు. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాలనటుడిగా ‘సిసింద్రీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అఖిల్, ఆ తర్వాత ‘మనం’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. 2015లో ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి తన కెరీర్లోనే అత్యుత్తమ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.