‘కస్టమర్లే మాకు దేవుళ్లు’ అంటారు వ్యాపారులు. ఆ కస్టమర్ దేవుళ్లు రాగానే ‘రండి రండి’ అంటూ నమస్కరిస్తారు సేల్స్ పర్సన్స్. వచ్చిన కస్టమర్‌ని కూర్చోబెట్టి వాళ్లకేం కావాలో నిలుచునే అడుగుతారు. కొనుగోలుదారులకు కావాల్సినవి ఇచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నా నిలబడే ఉండాలి. కాళ్లు లాగుతున్నా, మోకాళ్లు పీకుతున్నా సరే.. నిల్చొనే ఉండాలి. కూర్చుందామనే ఆలోచనే రానివ్వకుండా, అవకాశం లేకుండా అక్కడ కుర్చీ ఉంచదు యాజమాన్యం. పనిలో ఉన్నా, పని లేకున్నా పనివాళ్లను నిలబెట్టడమే ఆ యాజమాన్యానికి తెలిసిన వ్యాపారం.. వ్యవహారం. వచ్చినవాళ్లను కూర్చోమనకుంటే దండన.
ఖాళీ సమయంలో కూర్చుంటే దండన. ఇదెక్కడి న్యాయం?!
తనకాళ్ల మీద తాను నిలబడాలనేది అందరి కోరిక. చిన్న కొలువొస్తే చాలు సంతోషంగా బతకొచ్చు అనుకుంటారు. తన కాళ్ల మీద తాను నిలబడే రోజులు వచ్చాయని సంబురపడతారు. అలా నిలబడుతూ జీవితంతో తలబడే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కొలువు అంత తేలిక కాదని కొన్నాళ్లకే తెలిసిపోతుంది.
ఆ సంబురం ఆవిరైపోతుంది. నిలబడలేనని కొలువు మానేస్తే.. వాళ్ల జీవితాలు కూలిపోతాయి. అత్తెసరు చదువులు, మోయలేనన్ని బాధ్యతలు.. వారిని అలా నిల్చుండిపోయేలా చేస్తున్నాయి. ఓనర్లు చెప్పిన పని చేయడం తప్ప, తమకేది కావాలో నోరు తెరిచి అడగలేని దయనీయమైన పరిస్థితి వారిది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని వాళ్లకు తెలుసు.

అందుకే పరిస్థితులతో రాజీ పడుతుంటారు. ఈ ఆశనిరాశల జీవితంలో ఎన్ని బాధలు మోస్తున్నారో, ఎంత నొప్పిని భరిస్తున్నారో, ఎంతటి వేదన అనుభవిస్తున్నారో అర్థం చేసుకునేవాళ్లు ఉండరు. పిలిచి పీటవేసి కాసేపు కూర్చోమనే ఓనర్లు ఎక్కడా కనిపించరు. ‘అయ్యో .. అలా నిలుచోకుండా కాసేపు కూర్చోలేరా!’ అని సానుభూతి చూపే కస్టమర్లు కనిపించరు. షోకేసులో బొమ్మల్లా నిలబడే బతుకుతుంటారు. తాపీగా కూర్చుని ‘అది చూపించూ, ఇది చూపించూ’ అంటూ కస్టమర్లు ఎంతగా విసిగిస్తున్నా.. ముఖంలో రంగులు మార్చకుండా ఓనర్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని నిల్చున్న చోటే ప్రతి
క్షణం యుద్ధం చేస్తుంటారు సేల్స్ పర్సన్స్.
కూర్చోవడం సౌకర్యం. కూర్చోమనడం మర్యాద. కూర్చునే హక్కు కోట్లాది మంది ఉద్యమ నినాదం. ఈ హక్కు కోసం కేరళలో మొదలైన ఉద్యమం ‘రైట్ టు సిట్’ చట్టం చేయించింది. కూర్చునే హక్కు సాధించింది. దానికి సరిహద్దు రాష్ట్రం తమిళనాడునీ ఆ ఉద్యమం కదిలించింది. కదం తొక్కుతు ‘రైట్ టు సిట్’ నినాదం దేశమంతటికీ విస్తరిస్తున్నది. ‘పోరాడితే పోయేదేమీ లేదు నిలుచునే శిక్ష తప్ప’ అంటూ కూర్చునే హక్కు కోసం సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ నినదిస్తున్నారు.
ఇంటిల్లిపాదికీ కావాల్సిన దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు ఇంకెన్నో అమ్మే షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. ఇంటికి దీపం ఇల్లాలన్నట్టు మాల్స్‌కి దీపం సేల్స్ పర్సన్స్! కొత్త ఉత్పత్తులు అమ్మకానికి పెడితే వ్యాపారం నడవదు. కస్టమర్‌ని కన్విన్స్ చేస్తేనే పొద్దున్నే బోణీ అయ్యేది. వచ్చిన కస్టమర్‌కి నమస్కరించి, రకరకాల ఉత్పత్తులు చూపడంలో అద్భతమైన ప్రతిభను చాటుకుంటారు వాళ్లు. రంగురంగుల చీరలు చూపిస్తూ ‘మీరు ఈ చీర కడితే హీరోయిన్లా ఉంటార’ని మెప్పిస్తారు. ఆ చీర ఖరీదు చూసి హీరోగారు వేరేది చూపించమనగానే… ‘సార్ ఈ చీరతోపాటు మీరు ఆ కుర్తా ఫైజమా వేశారంటే మీ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుంటుంద’ని మాటలతో మెప్పించి మరొకటి కొనిపిస్తారు. పొద్దున పదకొండు గంటలకు మొదలైన ఈ మాటల ప్రయాణం రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. మధ్యలో విరామం అంటే తినడానికి మాత్రమే.

కొత్త మాడళ్లను పరిచయం చేయడం, కొత్త వాటిని పాత వాటితో పోల్చడం, కస్టమర్ సందేహాలను నివృత్తి చేయడం వాళ్ల రోజువారీ దినచర్య. మధ్యలో వచ్చి ఆటపట్టించాలనే కేటుగాళ్లకు కీలెరిగి వాత పెట్టినట్టు మాటలతో బదులిస్తూనే వ్యాపారం నడిపిస్తారు. నిమిషం ఖాళీగా ఉండరు. ఒక కస్టమర్‌తో మట్లాడుతూనే వెనుక వచ్చే మరో కస్టమర్‌ని కనిపెట్టుకుంటారు. పక్క షాపు వైపు ముఖం తిప్పుతుంటే ‘రండి సార్’ అంటూ ఆహ్వానిస్తారు. ముఖం చూసి కావాల్సిందేమిటో కనిపెట్టేస్తారేమో వెరైటీల దండకం చదువుతూ స్వాగతిస్తారు. ఆ పలకరింపుని కాదనలేక చూద్దామన్నట్టు లోపలికి అడుగుపెడితే చాలు.. ఆ కస్టమర్‌ని కొనకుండా పోనివ్వరు. ఒకటి కొందామని వస్తే రెండూ మూడు కొనేలా చేస్తారు. మళ్లీ రావాలంటూ మరో కస్టమర్ వైపు చూస్తూ ఇంకో పనిలో పడతారు. కస్టమర్లు తక్కువగా ఉంటే కొందరు సేల్స్‌లో ఉంటే, మరికొందరు స్టాక్‌ని సర్దుతూ షాప్‌ని సుందరంగా మార్చేస్తారు. బిజినెస్ స్స్కూల్లో చెప్పే సిలబస్ అంతా ఈ షాపుల్లోనే ఉంటుంది. వాణిజ్యం గురించి చదువుకోవాలంటే ఐఐఎంలో అడ్మిషన్ రాకపోతే ఏదో ఒక షాపులో చేరి నేర్చుకోవచ్చు. ఇదేమీ అతిశయోక్తి కాదు. బిజినెస్ స్కూల్ సిలబస్ రాసిన వాళ్లను అడిగినా చెబుతారు.
భారతీయ మహిళలు చీరలు, కుర్తా, పైజమా దుస్తులు ధరిస్తారు. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయని భావిస్తారు. మాల్స్, సూపర్ మార్కెట్లు ప్యాంట్, టీ షర్ట్ ధరించాలనే నిబంధన అమలు చేస్తున్నాయి. ‘అలవాటు లేని దుస్తులు ధరించడం ఒక అసౌకర్యమైతే. పిల్లల్ని కన్న తర్వాత పొట్ట లావుగా ఉండి వాటిని ధరిచడం ఇంకా అసౌకర్యం కలిగిస్తుంది. మహిళల సౌకర్యం, ఇష్టాలతో సంబంధం లేకుండా వారు ధరించే దుస్తులను యజమానులు నిర్ణయిస్తున్నారు’ అని మహిళా ఉద్యమ నాయకురాలు వి.సంధ్య అంటున్నారు. యువతులు ప్యాంట్, షర్ట్‌ని ధరించడానికి సిద్ధపడుతున్నారు. కానీ, పెద్ద వయసు ఉన్నవాళ్లు బిగుతుగా ఉండే దుస్తులు ధరించలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. మాల్స్, సూపర్ బజార్ యజమానులను, నిర్వాహకులను ప్యాంట్, షర్ట్‌కి బదులు చీర, పంజాబీ దుస్తులు ధరించే అవకాశం ఇప్పించాలని అడిగాం. ఏ ఒక్కరూ అందుకు అంగీకరించలేదని సంధ్య అన్నారు.

కస్టమర్‌కి, క్యాపిటలిస్ట్కి మధ్య వ్యాపార వారధులు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లే. కస్టమర్‌కి కావాల్సింది ఇస్తారు. వ్యాపారికి రావాల్సిన లాభం తెస్తారు. ఇద్దరికీ కోరుకున్నది జరుగుతుంది. కానీ, ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కోరుకున్నవి నెరవేరవు. ఫోన్, రెడీమెడ్ డ్రెస్, జువెల్లరీ, గ్యాడ్జెట్స్, కాస్మొటిక్స్, ఫుట్‌వేర్ షాపుల బోర్డులు, షాపులు చూస్తుంటే కళ్లు చెదిరిపోతాయ్! అద్దాల గోడలు, విద్యుద్దీపాల వెలుగులు, ఆకట్టుకునే అలంకారాలతో ఉండే మాల్స్, రిటైల్ షాపుల్లో సౌలత్లు కూడా అలాగే ఉంటాయి. కుషన్ కుర్చీలు, చల్లని ఏసీ గాలి.. పట్నం షాపింగ్‌లో మర్యాదలు మామూలుగా ఉండవు మరి! కస్టమర్‌ని కింగ్‌లా గౌరవిస్తారు. సామాన్యులు వచ్చినా అంతే.. మహరాజు లాగే మర్యాదలు చేస్తారు. షాప్ ఇమేజ్‌కి తగ్గట్టే సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ టిప్‌టాప్‌గా తయారవుతారు. ముఖాలకు పౌడర్లు రాసుకుని భలేగా ముస్తాబవుతారు. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. లిప్‌స్టిక్ రాసుకోవాల్సిందే. సూటు, బూటు వేసుకుని టక్ చేయాల్సిందే. అవన్నీ చూసి.. ‘అబ్బో వాళ్ల లైఫ్ బ్రహ్మాండం’ అనుకునేరు! కళ్లు చెదిరే మేకప్‌ల వెనుక కన్నీరు పెట్టించే కథలున్నాయి. ఆ కుషన్ కుర్చీల మెత్తదనం కస్టమర్లకే. సేల్స్ బాయ్స్‌కి అందులో అర నిమిషం కూర్చునే హక్కు ఉండదు. కాళ్లు నొస్తున్నాయి కూర్చుంటానని అడగలేరు. అడిగితే ఆ ఉద్యోగానికి అదే ఆఖరి రోజు. ‘ఆ ఆలోచనే రాకూడదు’ అని హెచ్చరిస్తుంది యాజమాన్యం. అలసిపోయి కాస్త గోడకు ఒరిగినా అంతే సంగతులు. నిలుచునే ఉండాలి. పనిలోనే ఉండాలి. ఈ రెండూ తప్ప మూడో ముచ్చట ఉండకూడదు. చేయని నేరానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు అనుభవిస్తున్న శిక్ష ఇది.

మాల్స్‌లోని షోకేసుల్లో ఉండే బొమ్మకు దాహం వేయదు. అందుకే దానికి మంచినీళ్ల అవసరం లేదు. షోరూమ్‌లో పనిచేసే సేల్స్‌గర్ల్స్ కూడా మంచినీళ్లు తాగరు. దాహం వేయక కాదు. నీళ్లు తాగితే మూత్రం ఆపుకొంటూ బాధపడాల్సి వస్తుందని వాళ్లు దాహాన్ని బలవంతంగా జయిస్తారు. నాలుక పిడుచకట్టుకుపోతున్నా.. గొంతు తడుపుకోరు. దర్బారులా తీర్చిదిద్దిన షాపులో ఇంటీరియర్ అదిరిపోతుంది. ఫాల్స్ సీలింగ్ డిజైన్ల కింద, విద్యుద్దీపపు కాంతుల్లో మెరిసిపోతున్న మాల్స్‌లో కనిపించని చీకటి చాలానే ఉంటుంది. వరుసగా వచ్చిపోతూ ఉండే కస్టమర్లతో బేరసారాలాడే నవ్వుల ముఖంలో బాధని దాచుకుని సేల్స్‌గర్ల్స్ పనిచేస్తూనే ఉంటారు. ఏసీ గదుల్లో గంట, రెండు గంటలకు వాష్‌రూమ్‌కి పోవాల్సిన అవసరం వస్తుంది. కానీ, అంత తేలిగ్గా అనుమతిరాదు.
అనుమతి కోరితే ‘ఇదేం మీ ఇల్లుకాదు’ అనే వెటకారం మళ్లీ అడగొద్దని హెచ్చరిక పాస్ చేస్తుంది. ‘కస్టమర్లను వదిలిపెట్టి బాత్రూమ్లో కూర్చుంటే నీ పని నేను చేయాలా?’ అనే యజమాని పరోక్షంగా కస్టమర్లు లేనప్పుడే వాష్ రూమ్‌కి పోవాలని చెబుతాడు. నిత్యం రద్దీగా ఉండే షాపులో అన్నీ ఆపుకొని పని చేయాల్సిందే. సేల్స్ ఉమెన్లలో యూరినరీ ఇన్ఫెక్షన్ల బాధితులు అధికంగా ఉండటానికి కారణం మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోవడమే. ఎప్పుడో ఒకసారి వాష్‌రూమ్‌కి అనుమతించినా అవెక్కడో సెల్లార్లలో చిన్నగా ఉంటాయి. చీకటి దారి వాళ్లను భయపెడుతుంది. అనేక చోట్ల ఆడవాళ్లకు, మగవాళ్లకు ఒకే వాష్‌రూమ్ ఉంటుంది. మగవాళ్ల వాష్‌రూమ్ డోర్ ముందు తలవంచుకుని ఎదురుచూడాల్సిందే.
మరొకరిని తోడు తెచ్చుకుని డోర్ ముందు కాపాలా పెట్టుకునే స్థితి. కొన్ని షాపుల ఓనర్లు ఇంతకంటే మంచోళ్లు! పనిచేసే మహిళలు భయపడకుండా ఉండాలని బాత్రూమే లేకుండా నడుపుతున్నారు. మూత్రం ఆపుకోలేకపోతున్నామంటే… అవకాశం ఉన్నచోటికి పోయిరమ్మని వెకిలిగా చెబుతారు. గోడల మీద రాసిన తిట్లను ఎగతాళి చేస్తూ మగవాళ్లు ఎక్కడో ఒక చోట పని కానిచ్చేస్తుంటారు. ఆత్మగౌరవం కోసం మహిళలు పక్క షాపులు, సులబ్ కాంప్లెక్స్‌కు వెళ్లి రావాల్సిందే. చట్టాలు ఎన్ని చెబుతున్నా మహిళల కోసం వాటిని అమలు చేయాల్సిన అవసరం ఎవరూ గుర్తించట్లేదు. అధికారులు, ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవడం లేదు.
పనిచేసే చోట కల్పించాల్సిన వసతుల గురించి కార్మిక శాఖ తనిఖీలు చేపడితే ఒక్కరోజులో సగం షాపులు మూతపడతాయి అనడంలో అతిశయం లేదు. అయినా అన్ని షాపులు సజావుగా నడుస్తున్నట్టు కార్మికశాఖ అధికారులు కలలు కంటుంటారు. పురపాలక శాఖకూ ఇది పట్టదు. పనిచేసే ఉద్యోగులే కాదు ఆపుకోలేని బాధతో కస్టమర్‌కి అసౌకర్యం కలిగినా దగ్గర్లో ఉంటే ఇంటికి, లేకుంటే సులబ్ కాంప్లెక్స్‌కి పరుగులు పెట్టాల్సిందే. షాపుల్ని ఆకట్టుకునేందుకు ఏడాదికోసారి కొత్తగా డెకరేట్ చేస్తారు. పదేళ్లకోసారి భవానాన్ని రినోవేట్ చేస్తారు. కానీ, ఈ మార్పుల్లో షాపుల్లో పనిచేసేవాళ్ల కోసం బాత్రూమ్ వసతి కల్పించాలని ఆలోచించరు. అదొక్కటే భారం అనుకుంటారు. ఇలా భవనాలు నిర్మించడం, వ్యాపారలు నడపడం చట్ట విరుద్ధం. కానీ, అవి ఓనర్లకు చుట్టాలయ్యాయి.
కంపెనీ లాభాలకు సేల్స్ పర్సన్ల జీతాలకు పొంతన ఉండదు. కార్మిక చట్టాల ప్రకారం జీతాలే కాదు పీఎఫ్ లేనివాళ్లే ఎక్కువ. కొద్దిపాటి ఎర్నింగ్ బతుక్కి ఎర్న్డ్ లీవ్స్ అసలే ఉండవు. అందమైన చీరలు, ముఖానికి రంగు, లిప్‌స్టిక్, టక్‌తో టిప్‌టాప్‌గా తయారై అద్దాల గోడల మధ్య మేకప్‌తో మెరిసిపోతూ కనిపించే సేల్స్ ఉమెన్ జీవితం నరకం లాంటిదని చాలామందికి తెలియదు. ఆవలించినా, కాస్త కునుకు తీసినా కనిపెట్టడానికి రెప్పవాల్చని కెమెరా కన్ను డేగ చూపులు చూస్తూనే ఉంటుంది. ఆ కెమెరా లుక్కులు తప్పించుకుని ఏదో ఒక మూలన కునుకు తీసినా.. కస్టమర్ రాకతో ఉలిక్కిపడి లేస్తారు. భయపడి ‘సార్ ఎవరితో చెప్పకండి సార్’ అంటూ దీనంగా వేడుకుంటారు. ఇక మేనేజరే చూస్తే కాళ్లావేళ్లా పడి బతిమాలుకోవాల్సిందే. ఇదీ వాళ్ల దయనీయ స్థితి. పెద్ద పెద్ద మాల్స్‌లో కొలువనే పేరేగాని జీతాలు పెద్దగా ఉండవు. పీఎఫ్ ముచ్చట లేదు. ఈఎస్ఐ వెసులుబాటు అస్సలు ఉండదు. బాధ్యతల నిర్వహణ తప్ప.. హక్కుల ప్రస్తావనే అక్కడ వినిపించదు. అవన్నీ అడిగితే ‘ఉంటే ఉండు పోతే పో’ అనే మాటే వినిపిస్తుంది.
‘కాళ్లు లాగుతున్నాయి. నిలబడలేకపోతున్నా. కాసేపు కూర్చుంటాన’ని సేఠ్లను అడిగితే కరుణించేవాళ్లు కొందరైతే, కళ్లల్లో నిప్పులు పోసుకునేవాళ్లు ఇంకొందరు. ‘నీకు కుర్చీ వేసి, కూర్చోబెట్టడానికి జాబ్‌లో పెట్టుకోలేదు’ అనే చోట సర్దుకుపోయి ఉండాల్సిందే. వద్దనుకుంటే జీతం కంటే కాస్త తక్కువే అయినా అర్థం చేసుకునే చోటికి మారిపోతున్నారు. చాలామంది సిజేరియన్ చేయించుకుని ప్రసవించినవాళ్లు నడుము నొప్పితో బాధపడుతుంటారు. మహిళలను వెంటాడే సాధారణ సమస్య రక్తహీనత. నీరసం, అలసట, నెలసరి సమస్యల్లో కూడా నిలుచునే పని చేయడం ఎంతో కష్టమైన పని. ‘చేతకాకుంటే మానేయ్’ అనేచోట కష్టాలు చెప్పుకోవడమే మానేస్తున్నామని సేల్స్ గర్ల్స్ చెబుతున్నారు.
సేల్స్ పర్సన్‌గా పనిచేసే వాళ్లలో ఆడవాళ్లకు ఇంకా ఎక్కువ కష్టాలు. పొద్దున పదకొండు గంటలకు డ్యూటీ ఎక్కి, రాత్రి తొమ్మిది గంటలకు డ్యూటీ దిగుతారు. బస్సుల్లో, ఆటోల్లో కిక్కిరిసిన జనం మధ్య అలసి సొలసి ఇంటికి పోయినా విశ్రాంతి దొరకదు. తన కోసం ఇల్లు కూడా ఎదురుచూస్తూ ఉంటుంది. అక్కడ బండెడు చాకిరీ మళ్లీ మీదేసుకోవాల్సిందే. ఆ భారం పంచుకునేవాళ్లే ఉండరు. ‘అమ్మా తినిపించు’ అనే పిల్లల మారాం ఆమెను ఉక్కిరిబిక్కరి చేస్తుంది. ఇంటికొచ్చాకా కూర్చునే అవకాశం ఉండదు. అందరూ తిన్న తర్వాతే తిని, అందరూ నిద్రించిన తర్వాతే మంచమెక్కుతారు.
మళ్లీ అందరికన్నా ముందే లేవడం ఆమె బాధ్యత. ఈ భారమైన జీవితాన్ని దశాబ్దాలుగా భరిస్తూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ, వాళ్ల పట్ల జాలిచూపేవాళ్లు లేరు. కనికరించి కాసేపు కూర్చోమనే యజమానులు ఉండరు. అర్థం చేసుకుని అర్ధాంగి పనిని పంచుకునే భర్తా దొరకడు. రోజంతా కష్టపడిందని కాస్త విశ్రాంతినివ్వాలనే ఆత్మీయతలు చాలా అరుదు. ఇన్ని సవాళ్ల మధ్య ఉద్యోగాన్నీ నిలబెట్టుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న ఈ వర్కింగ్ ఉమన్స్ గొప్ప గొప్ప విజేతలకేమీ తీసిపోరు. అన్యాయం. అమానుషం. అవమానం భరించే ఈ సేల్స్ ఉమెన్స్‌కి న్యాయం జరగాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘రైట్ టు సిట్’ అని నినదిస్తున్నాయి.
‘రైట్ టు సిట్’ కోసం రెండు దశాబ్దాల క్రితం ఉద్యమం రాజుకుంది. కేరళలో పాలితొడి విజ్జి అనే మహిళ టాయ్‌లెట్‌కి వెళ్లాలని యజమానిని అడిగితే.. ‘నీళ్లు తక్కువగా తాగు’ అన్నాడట. ఆ అవమానం విజ్జీని ఉద్యమానికి పురికొల్పింది. ‘పెన్‌కూటు’ అనే మహిళా సంఘాన్ని స్థాపించింది. తమ శారీరక, ఆరోగ్య సమస్యలను చర్చించడం మొదలుపెట్టింది. తనతో వచ్చే మహిళలతో కలిసి ఉద్యమానికి నడుం కట్టింది. ‘కూర్చోవాలని రోడ్డెక్కడం ఎందుకు? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందిగా’ అనే అవమానాలను దాటుకుని ఆ ఉద్యమం కేరళా అంతటా విస్తరించింది.
ఆ రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్… కోర్టు తలుపుతట్టింది. చివరికి 2018లో కేరళ ప్రభుత్వం ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’లో సవరణలు చేసి ఉద్యోగులు కూర్చునే సౌకర్యం కల్పించడం తప్పనిసరి చేసింది. షాపులు, మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఉండాలని, కూర్చునేందుకు యజమాని, మేనేజర్ అనుమతి అవసరం లేదని చట్టం చేసింది. ఆ చట్టం అమలు కోసం వ్యాపారలు కుర్చీ వేయక తప్పలేదు. ఈ ప్రభావం సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుని ప్రభావితం చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో సవరణలు చేసింది. యజమానిని ప్రశ్నించేందుకు భయపడే సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌లు ఇప్పుడిప్పుడే తమ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. తెలంగాణలోనూ ఆ హక్కు సాధించాలని, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు కూర్చునే అవకాశం రావాలని అందరం కోరుకుందాం. అప్పటిదాకా యజమానులు మారాలని, ప్రభుత్వాలూ చొరవచూపాలని అడుగుదాం.
ఇళ్లల్లో పనిచేసేవాళ్లు పొద్దున నాలుగు గంటలకు లేచి అయిదారు కిలోమీటర్లు నడిచిపోతారు. ఊడ్వడం, గదులు తుడవడం, వంట చేయడం, బోళ్లు కడగడం, బట్టలు ఉతికే పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో బాగా అలసిపోతారు. అపార్ట్మెంట్లలో పని మనుషుల్ని లిఫ్ట్ ఎక్కనివ్వరు. పనిలో కుదిరేటప్పుడే లిఫ్ట్ ఎక్కొద్దని చెబుతారు. కొన్ని చోట్ల లిప్ట్ ఎక్కబోతే వాచ్మెన్లు ఆపుతారు. ఇళ్లల్లో పనిచేసేవాళ్లు నిల్చునే ఉండాలి. లేకపోతే కిందనే కూర్చోవాలి. బాత్ రూమ్ క్లీన్ చేయించుకుంటారు. కానీ, ఆ బాత్రూమ్ని వాడుకోనివ్వరు. మూత్రం ఆపుకొని ఉండాల్సిందే. ఇంటి బయట మెట్ల కింద బాత్రూమ్ ఉంటే అది వాడుకోమంటారు. ఇళ్లల్లో పని చేసేవాళ్లు పబ్లిక్ టాయ్లెట్స్కే పోతారు. సడెన్‌గా పిరీయడ్స్ వస్తే కూర్చోవడానికి నిరాకరిస్తారు. షాపుల్లో సేల్స్ గర్ల్స్‌కి ఉన్న బాధలన్నీ ఇళ్లల్లో పని మనుషులకూ ఉన్నాయి. లిఫ్ట్, బాత్రూమ్ ఉపయోగించుకోవడానికి నిరోధిస్తే వాళ్లపై చర్యలు తీసుకునే చట్టం రావాలి.
– మంజుల, గృహ కార్మికుల యూనియన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు
మాల్స్, సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్, షాప్‌లలో పని చేస్తున్న వారికి విశ్రాంతి కోసం విరామం ఇవ్వాలి. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు షిప్ట్ విధానం అమలు చేయాలి. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్యోగ నియామక పత్రం ఇవ్వాలి. పీఎఫ్, ఇతర ఉద్యోగ నియమాలు పాటించేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రతి షాప్‌లో కూర్చునేందుకు అనుమతించాలి. అందుకోసం కుర్చీలు ఉంచాలి. అనుమతి లేకుండా హక్కుగా కూర్చోనివ్వాలి. బాత్రూమ్ వసతి కల్పించని షాపులపై చర్యలు తీసుకోవాలి.
– కొండవీటి సత్యవతి, భూమిక వ్యవస్థాపకురాలు
– నాగవర్ధన్ రాయల