BRS Australia : తెలంగాణ ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరుల దాడిని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) శాఖ తీవ్రంగా ఖండించింది. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ ప్రతీకార ధోరణికి స్పష్టమైన నిదర్శనమని కాసర్ల నాగేందర్ రెడ్డి (Kasarla Narender Reddy) విమర్శించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి క్యాంపు కార్యాలయంపైనే దాడి జరగడం అంటే ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ విలువలపై దాడి అని ఆయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి పాలనలో ప్రముఖ నాయకులకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోందని కాసర్త నాగేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమది“ప్రజా రాజ్యం” అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజకీయ కక్ష సాధింపు చర్యల ద్వారా రాష్ట్రాన్ని అశాంతి వైపు నెడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత ఆందోళనకరమని, ప్రజల రక్షణ కోసం ఉండాల్సిన పోలీసులు ఈ ఘటనలో నిర్వీర్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు.
చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం నిష్పాక్షికంగా పని చేయకపోతే, ప్రజల నమ్మకం దెబ్బ తింటుందనే విషయాన్ని నాగేందర్ రెడ్డి గుర్తు చేశారు. ‘అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని అధికారంలో ఉన్న వారు గుర్తుంచుకోవాలి. భయపెట్టే ప్రయత్నాలు, దాడులు చేసి ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇలాంటి దాడులతో మేము వెనక్కి తగ్గే వాళ్లం కాదు. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారు. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించాలి’ అని కాసర్ల నాగేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.