కంది, మార్చి 13 : ఆధునిక పరిశ్రమల డిజిటల్, కంప్యూటేషనల్ రంగంలో ఇంజినీర్లను సిద్ధం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్‌లో నూతన ఎంటెక్ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. దేశంలోనే మెదటి ఏఐ, ఎంఎల్లో కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులను శుక్రవారం ఐఐటీహెచ్‌లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ నూతన ఎంటెక్ కోర్సులు పరిశ్రమలు, సమాజంలో పరివర్తన సాంకేతికలను సృష్టించేందుకు దోహదపడుతాయని వెల్లడించారు. కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కృత్రిమ వనరుల ఏకీకరణతో కెమికల్ ఇంజినీరింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ఈ రెండు కొత్త కోర్సులకు వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.
బాసర ‘ట్రిపుల్ఐటీ’ షెడ్యూల్ విడుదల
బాసర, మార్చి 13 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2026-27 ప్రవేశాల షెడ్యూల్‌ను శుక్రవారం వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. 16న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆన్లైన్ ద్వారా 18 నుంచి మే 10వ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. స్పెషల్ క్యాటగిరీల వారికి మే 20 చివరి తేదీగా నిర్ణయించినట్టు వెల్లడించారు. విద్యార్థుల మెరిట్ లిస్ట్‌ను మే 30న విడుదల చేసి, జూన్ 5 నుంచి మొదటి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు.
పది పరీక్షలు ముగియకముందే నోటిఫికేషన్!
గతంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసేవారు. ఇప్పుడు మాత్రం పది పరీక్షల ప్రారంభానికి ముందే షెడ్యూల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ట్రిపుల్‌ఐటీలో టెక్ ఫెస్ట్ జరుగుతుండగానే, షెడ్యూల్ ప్రకటించడంతో ప్రభుత్వ అనుమతి ఉందా..? ట్రిపుల్ఐటీ అధికారులే అత్యుత్సాహంతో నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకున్నారా..? అసలు ఈసీ అనుమతి ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.