కాళేశ్వరం, జూలై 31: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు సీడబ్ల్యూసీ (CWC) కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటిమట్టం 11.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాంతంలో వాతావరణం మేఘావృతంగా ఉంది.
మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 96.40 మీటర్లు నమోదైంది. బ్యారేజ్ వద్ద మొత్తం 8,35,800 క్యూసెక్కుల వరద ప్రవాహం ఇన్ఫ్లో, అవుట్ఫ్లోగా కొనసాగుతుండగా, వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు 85 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం గోదావరి నది బ్యారేజ్ వద్ద ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవహిస్తోంది.
కాళేశ్వరం వద్ద హెచ్చరిక స్థాయి 12.210 మీటర్లు, ప్రమాద స్థాయి 13.460 మీటర్లుగా ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Kaleshwaram2