Rare Himalayan fish : అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత అరుదైన హిమాలయన్ చేప ప్రత్యక్షమైంది. తవాంగ్ జిల్లాలోగల ఓ ఎత్తయిన సరస్సులో ఈ అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ ఆవిష్కరణ దేశంలోని మంచినీటి చేపల వైవిధ్యంలో మరో కొత్త జాతిని జోడించింది. ఇంతకుమునుపు టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తయిన సరస్సుల్లో గుర్తించిన అరుదైన ‘స్కిజోపిగాప్సిస్ వడెల్లి’ అనే అరుదైన చేపల జాతికి ఇది విస్తరణగా చెప్పవచ్చన్నారు.
ఉత్తరాఖండ్‌లోని భీమతాల్లో గల ఐకార్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ రిసెర్చ్ (ఐకార్-సీఐసీఎఫ్ఆర్) నుంచి అరుణాచల్‌ప్రదేశ్ మత్స్యశాఖ సహకారంతో గత జూలై నెలలోనే పరిశోధకులు వీటి నమూనాలు సేకరించారు. సిప్రినిడి కుటుంబానికి చెందిన ఈ చేపలు అధిక ఎత్తులో ఉండే మంచినీటి సరస్సుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలవాటుపడి ఉంటాయి. పొడవాటి స్తూపాకార శరీరాన్ని కలిగి ఉండే ఈ చేప పైభాగాన ముదురు బూడిదరంగు లేదా ఆలివ్ రంగుతో కింది భాగాన లేత వెండిరంగు లేదా మీగడలాంటి తెల్లరంగుతో ఉంటుంది.