Hero | కోలీవుడ్ యువ హీరో కవిన్ జీవితంలో మరపురాని ఆనంద క్షణాలు చోటు చేసుకున్నాయి. తన నటనతో తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిన్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతను స్వీకరించారు. ఆయన భార్య మోనికా కవల పిల్లలకు జన్మనివ్వగా, ఈ శుభవార్తను స్వయంగా కవిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. 2023 ఆగస్టులో తన చిరకాల స్నేహితురాలు మోనికాను వివాహం చేసుకున్న కవిన్.. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ వచ్చారు. తాజాగా తమ కుటుంబంలో కొత్త సభ్యులు చేరిన విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మా జీవితాలను రెట్టింపు ఆనందంతో నింపినందుకు దేవుడికి కృతజ్ఞతలు. మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారు అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.ఈ శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో కవిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “డబుల్ బ్లెస్సింగ్స్”, “క్యూట్ ఫ్యామిలీ”, “కంగ్రాట్స్ కవిన్” అంటూ వేలాది కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు ఈ జంటకు ఆరోగ్యంగా, ఆనందంగా పిల్లలు పెరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది మరింత ప్రత్యేకం కావడానికి మరో కారణం కూడా ఉంది. కవిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘డాడా’ సినిమాలో ఆయన ఓ చిన్నారి తండ్రి పాత్రలో నటించారు. ఆ సినిమాలో తండ్రి పాత్రలో భావోద్వేగ నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న కవిన్.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా తండ్రిగా మారడంతో అభిమానులు “రీల్ డాడా.. ఇప్పుడు రియల్ డాడా” అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.
కెరీర్ పరంగా కూడా కవిన్ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ‘హాయ్’ (Hi) చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు విష్ణు ఎడవన్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు కెరీర్లో వరుస అవకాశాలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కవల పిల్లల రాకతో కవిన్ జీవితంలో ఆనందాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఆయన కుటుంబానికి అభిమానులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.