Dev Ji | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ స్పష్టంచేశారు. ఇందుకు తెలంగాణ అభివృద్ధితోపాటు యువత ఆలోచనల్లో మార్పు రావడం మరో కారణమని కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను ప్రశంసించారు. అందువల్లనే 2019 నుంచి మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయని పేర్కొన్నారు. తాము ఆయుధాలు మాత్రమే వీడామని, పోరాట మార్గం వీడలేదని పేర్కొన్నారు.
తమది లొంగుబాటు కాదని, తమను అరెస్టు చేసి లొంగుబాటుగా చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీలోనూ చేరేదిలేదని స్పష్టంచేశారు. తాము ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూనే రాజ్యాంగబద్ధంగా పోరాటాలు కొనసాగిస్తామని, మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిషేధం ఎత్తివేయకపోతే, తాము మరో పార్టీ స్థాపించాల్సిన అనివార్యత ఏర్పడుతుందని చెప్పారు. దేవ్‌జీ, పార్టీ మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌తో కలిసి ‘నమస్తే తెలంగాణ క్రైమ్ ప్రతినిధి’కి శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూఇచ్చారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే..
నమస్తే తెలంగాణ: లొంగిపోయిన మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం మీ పార్టీపై నిషేధం ఎత్తివేస్తుందని భావిస్తున్నారా?
దేవ్‌జీ: ప్రజల కోసం ఇన్నాళ్లూ అడవుల్లో ఆయుధాలు పట్టుకొని కొట్లాడాం. అనివార్య పరిస్థితుల్లోనే అడవుల నుంచి బయటికి రావా ల్సి వచ్చింది. ప్రజల కోసమే, ప్రజల పక్షానే పోరాడుతాం. ప్రజలతోనే ఉంటూ ఉద్యమాలు చేపడుతాం. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ద్వారా చెప్పిం చాం. వారు కూడా సానుకూలంగా ఉం టారనే అనుకుంటున్నాం. లేకపోతే ఓ కొత్త రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉండొచ్చు. అది పార్లమెంటరీగా వెళ్తామా? పోరాట పంథాలోనే వెళ్తామా? అనేది కాలం నిర్ణయిస్తుంది.
నమస్తే తెలంగాణ: మీరు లొంగిపోయారని పోలీసులు అంటున్నారు? ఇంతకీ మీది లొంగుబాటా? అరెస్టా?
దేవ్‌జీ: మాది లొంగుబాటు కాదు ముమ్మాటికీ అరెస్టు. ఫిబ్రవరి 18న నన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రాజిరెడ్డిని హనుమకొండలో అరెస్టు చేశారు. అలాగే మిగతావారిని కూ డా. నా అరెస్టుకు ముందే మావాళ్లను చాలామందిని అరెస్టు చేశారు. అయితే, ఇక్కడి ప్రభు త్వం లొంగుబాట్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో మాది లొంగుబాటుగా చూపించారు. అరెస్టుతోనే బహిరంగ జీవితంలోకి రావాలనుకున్నాం.
నమస్తే తెలంగాణ: తెలంగాణ నుంచి వెళ్లిన మావోయిస్టుగా చెప్పండి. ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు మీరు ఏం గమనించారు?
దేవ్‌జీ: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం కూడా మా పోరాటం కొనసాగింది. మలిదశ ఉద్యమంలోనూ మా పాత్ర ఉన్నది. అంతిమంగా, రాజకీయంగా దానిని కేసీఆర్, ఇతరులు ముందుకు తీసుకెళ్లారు. ప్రజలంతా కదిలారు. ఒక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు ప్రజల కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నది.
నమస్తే తెలంగాణ: 2019 నుంచి మావోయిస్టు పార్టీకి తెలంగాణ నుంచి కొత్త రిక్రూట్స్మెంట్ లేవని డీజీపీ చెప్పారు? నిజమేనా?
దేవ్‌జీ: 2019 నుంచి మన రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్స్ లేవు. అందుకు ప్రధాన కారణం.. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు.. యువత ఆలోచనల్లో మార్పు రావడం మరో ఎత్తు.
నమస్తే తెలంగాణ: ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రితో ఏ అంశాలపై చర్చలు జరిపారు?
దేవ్‌జీ: ప్రజల సమస్యలపైనే పోరాడాలని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు కూడా మా పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. మా ఆయుధాలు అప్పగించడంతోపాటు.. పీఎల్జీఏ మొత్తం ఆయుధాలతో సరెండర్ అవుతుందని ఒప్పించాం. అందుకాయన కేంద్రంతో మాట్లాడి చెబుతామన్నారు.
నమస్తే తెలంగాణ: ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమిటి?
దేవ్‌జీ: మా పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. చట్టబద్ధమైన రాజకీయ పార్టీగా గుర్తించాలి. దేశవ్యాప్తంగా ఖైదీలుగా ఉన్న మా వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడిపించాలి. మా ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అందుకు ప్రభుత్వాల సహకారం ఉండాలి.
నమస్తే తెలంగాణ: అడవుల నుంచి బయటికొచ్చిన తర్వాత ఏ సమస్యలను గుర్తించారు? ఎలాంటి పోరాటాలు చేయాలనుకుంటున్నారు?
దేవ్‌జీ: మేము అడవుల నుంచి బయటికి వచ్చినా అడవుల్లోని ఖనిజ సంపద పరిరక్షణ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగంపై కూడా పోరాడుతాం. పట్టణాల్లో ఇండ్ల స్థలాల సమస్య ఉన్నది. ఈ మధ్య ఎప్పుడు చూసినా కూల్చివేతలే ఉన్నాయి. ఇట్లాంటి అనేక సమస్యలపై పోరాడుతాం.
నమస్తే తెలంగాణ: మీరు రాజకీయ పార్టీ పెడితే.. పార్లమెంటరీ వ్యవస్థలోనే వెళ్తారా? లేక మరేదైనా మార్గం ఉన్నదా?
దేశ్జీ: ప్రజల కోసం, ప్రజల్లో ఉండి ఉద్యమాలు చేయాలంటే మా పార్టీపై నిషేధం ఎత్తివేసి, చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి. అంటే మేము ఇతర పార్టీల్లోకి వెళ్లడం కాదు. మేము ఎన్నికల్లో పాల్గొనడం కాదు. ప్రజల సమస్యలపైనే మా పోరాటం ఉంటుంది. ఎన్నికల్లో పాల్గొనడమనేది ఒక అవినీతిగా మారిపోయింది. అది మాకు వద్దని అనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం.
నమస్తే తెలంగాణ: సోనూ, ఆశన్నపై పార్టీ మొత్తం వ్యతిరేకంగా ఉండటానికి కారణం ఏమిటి? వారు మీతోపాటు ప్రజా ఉద్యమంలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా?
దేవ్‌జీ: మావోయిస్టు పార్టీ చీలిపోవడానికి ప్రధాన కారణమే సోనూ, ఆశన్న. మేము వద్దని వారించినా కూడా వాళ్లు ప్రాణభీతితో శత్రువుతో చేతులు కలిపి, ఆయుధాలు శత్రువుకు అప్పగించి లొంగిపోయారు. దీంతో పార్టీలో వర్గాలొచ్చాయి. మేము నియంత్రించలేని స్థితికి పార్టీ వచ్చింది. వారిబాటలో చాలామంది లొంగిపోవాల్సి వచ్చింది. వారు మాతో కలిసి పనిచేయాలంటే కచ్చితంగా ప్రజలకు, మా పార్టీకి వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఆలోచిస్తాం.
నమస్తే తెలంగాణ: ఇప్పటికీ మీకు ప్రజల మద్దతు ఉన్నదని భావిస్తున్నారా? అర్బన్ నక్సల్స్ పెరిగే అవకాశం ఉన్నదా?
దేవ్‌జీ: ప్రజల మద్దతు ఉన్నది కాబట్టే అడవుల నుంచి అర్బన్‌లోకి రాగలిగాం. మేము అక్కడ దొరకలేదు. ఇక్కడ మాత్రమే దొరికాం. అర్బన్ నక్సలిజం అనేది ప్రభుత్వాలు సృష్టించిన పదం. అలా పలికేవాళ్లే చట్ట వ్యతిరేతికులు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లను, రాతలు రాసేవాళ్లను ఆ గాడికి కట్టేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛగా భావాలు ప్రకటిస్తే.. అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తారు.
నమస్తే తెలంగాణ: కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది?
దేవ్‌జీ: అది ముమ్మాటికీ తప్పు. మేము ప్రజల సమస్యల మీద లీగల్‌గానే పోరాడుతాం. పార్లమెంటరీ పరంగా వెళ్లం. మాది పోరాటమే కానీ.. పోటీ కాదు. ఇప్పటివరకూ చేసింది రాజకీయమే. కాకపోతే ఆయుధాలు వదిలేస్తున్నాం. ప్రజల సమస్యలపై చట్టబద్ధంగానే మా పోరాటం.
చెత్త బుట్టలోకి ఆరు గ్యారెంటీలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను చెత్తబుట్టలో పారేసిందని మావోయిస్టు అగ్రనేత మల్లా రాజారెడ్డి పేర్కొన్నారు. హైడ్రా ద్వారా ఇండ్లు కూలగొడుతున్నారని, పెట్టుబడిదారులకు ఎకరాలకు ఎకరాలు అగ్గువకు ఇస్తున్నారని ‘నమస్తే తెలంగాణ క్రైమ్ ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
నమస్తే తెలంగాణ: ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు?
రాజిరెడ్డి: ప్రజల్లో ఇప్పుడిప్పుడే తిరుగుతున్నాం. వారి సమస్యలపై అధ్యయనం చేస్తున్నాం. ఇటీవల కుటుంబసభ్యులను కలిశాను. నేను సంరక్షించుకున్న ప్రజల్లో నా వాళ్లు ఉండటం నాకు సంతోషమే.
నమస్తే తెలంగాణ: ప్రభుత్వాలు ఇచ్చిన హామీలపై మీ స్పందనేమిటి? ప్రభుత్వ పథకా లు ప్రజల్లోకి వెళ్తున్నాయని అనుకుంటున్నారా?
రాజిరెడ్డి: పార్టీలకు కావ్సాలింది ఫ్యూడల్ ఆపరేషన్. పెట్టుబడులు వచ్చేవిధంగానే వారి ఆపరేషన్ ఉంటుంది. ప్రభుత్వాలు కొన్ని ఉచిత పథకాలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారు. కేసీఆర్ సర్కార్ అది చేయలేదు, ఇది చేయలేదని రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారెంటీలు అని చెప్పి వచ్చారు. అన్ని గ్యారెంటీల్లో ఒక్కటే అమలు చేశారు. అది కూడా మహిళలకు ఉచితబస్సు మాత్రమే. మిగతావన్నీ చెత్తబుట్టలో పారేసినట్లే. అందరీలాగే వీళ్లు కూడా. వీరంతా ఒకే కొమ్మ పువ్వులు. హైడ్రా ద్వారా ఇండ్లు కూల గొడుతున్నారు. ప్రజలకు ఇండ్లు కట్టుకునేందుకు జాగ ఉండదు. రైతులు దున్నుకునేందుకు భూమి ఉండదు కానీ, పెట్టుబడిదారులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు అగ్గువగా ఇస్తున్నారు.
నమస్తే తెలంగాణ: గణపతి ఎప్పుడు లొంగిపోతున్నారు? ఆయన్ని మీరు చివరిగా ఎప్పుడు చూశారు?
రాజిరెడ్డి: గణపతి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన లొంగుబాటు కూడా వ్యక్తిగతం. ఆయన్ని చివరిగా 2024 ఆగస్టులో చూశాం. ఇటీవల ఎస్ఐబీ అధికారులు ఆయన కొడుకుతో ఒక ఆడియో విడుదల చేయించారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధాలతో కొట్లాడటం కుదరదు.