పాలకుర్తి, మార్చి 13 : ‘పిచ్చి పిచ్చిగా ఉందా…తమాషా చేస్తున్నావా… ఫొటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నావు.. ఎక్కువ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తా బిడ్డా’ అంటూ ఎస్సై దూలం పవన్‌కుమార్ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై ఎమ్మెల్యే సాక్షిగా బెదిరింపులకు దిగాడు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ఇందిరా మహిళాశక్తి భవనానికి శుక్రవారం భూమిపూజ చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త ముస్కు కర్ణాకర్, నాయకులు ఎమ్మెల్యేను కలిసి.. మేడం ఇది ప్రభుత్వ పాఠశాల స్థలం, ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వేరే ప్రభుత్వ స్థలంలో మహిళా శక్తి భవనం నిర్మించాలని కోరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు ముస్కు సంపత్ వీడియో తీస్తుండగా.. గమనించిన ఎస్సై దూలం పవన్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యే పీఏ రాజేశ్‌గౌడ్ అతడి సెల్‌ఫోన్ గుంజుకున్నారు. ఇదేంటని ప్రశ్నించగా ఎస్సై దూలం కండ్లు ఎర్రజేసి.. వేలుచూపుతూ ‘నీ అంతు చూస్తా.. మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా..’ అంటూ బెదిరింపులకు దిగాడు.
సలహాలిస్తే దాడులు, బెదిరింపులా అంటూ బీఆర్ఎస్ నాయకుడు ముస్కు కరుణాకర్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల స్థలంలో మహిళాశక్తి భవనానికి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఎలా పూజ చేస్తారని నిలదీశారు. పాఠశాలతోపాటు క్రీడా ప్రాంగణం ఉందని ఎమ్మెల్యేకు వివరిస్తే స్థానిక ఎస్సై దూలం పవన్‌కుమార్, ఎమ్మెల్యే పీఏ.. ఎమ్మెల్యే సాక్షిగా తమపై దాడులు చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా నాయకుడు సంపత్ సెల్‌ను ఎమ్మెల్యే పీఏ ఎలా గుంజుకుంటారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడతా.. రౌడీషీట్ ఓపెన్ చేస్తా అని బెదిరించిన ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.