Influencers | మార్కెటింగ్ వ్యూహాలు మారిపోతున్నాయి. ప్రచార విధానాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.నిన్నమొన్నటి వరకూ సినిమా, స్పోర్ట్స్ .. తదితర గ్లామర్ ప్రపంచాల చుట్టూ చక్కర్లు కొట్టిన బ్రాండ్ మేనేజర్లు.. హఠాత్తుగా దారి మార్చుకున్నారు. తమ ఉత్పత్తుల ప్రచారానికి ఇన్ఫ్లుయెన్సర్ల సాయం తీసుకుంటున్నారు. అలా అని ఇదేం యథాలాపంగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక పక్కా అంచనా ఉంది.
సామాజిక మాధ్యమాల్లో నయా ట్రెండ్స్ గురించి నిత్యం అధ్యయనాలు, విశ్లేషణలు జరుగుతూనే ఉంటాయి. వాటి ఆధారంగానే కార్పొరేట్ కంపెనీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయి. బ్రాండింగ్ కోసం సెలెబ్రిటీల స్థానంలో ఇన్ఫ్లుయెన్సర్లను ఎంచుకోవడం వెనుకా అలాంటి కారణమే ఉంది. తాజా పరిశీలన ప్రకారం..
⍟ ఇన్ఫ్లుయెన్సర్లు సిఫారసు చేసిన ఉత్పత్తులనే వినియోగదారులు కొంటున్నారు.
⍟ ఆన్లైన్ సమీక్షలు, అభిప్రాయాలను నమ్ముతున్నారు.
⍟ సామాజిక మాధ్యమాలకు మరింత సమయం కేటాయిస్తున్నారు జనం. ఏ సినీతారో చేసిన ప్రచారం కంటే, తమకు బాగా తెలిసిన వ్యక్తి ఇచ్చే సలహా వైపే మొగ్గు చూపుతున్నారు.
⍟ కొత్త ట్రెండ్స్, ఐడియాల కోసం ఇన్ఫ్లుయెన్సర్ల మీదే ఆధారపడుతున్నారు.
ఇక్కడ మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటారు. సందేహాలు తీరుస్తారు. భయాలు పోగొడతారు. సలహాలు ఇస్తారు. సెలెబ్రిటీలతో ఈ వెసులుబాటు ఉండదు. అంతమాత్రాన, మెరిసేదంతా బంగారమే అనుకోవడానికి వీల్లేదు. అదో తళుకుబెళుకుల ప్రపంచం. సోషల్‌మీడియాలో కనిపించే ఇన్ఫ్లుయెన్సర్ల కార్యకలాపాలు అసలైనవి కాకపోవచ్చు. అసలు ఆ ఇన్ఫ్లుయెన్సరే ఓ రోబో కావచ్చు, ఎవరికి తెలుసు? మీరు అడిగిన ప్రశ్నకు ఠంచనుగా జవాబు వచ్చిన ప్రతిసారీ పొంగిపోవాల్సిన అవసరమే లేదు. అదీ కృత్రిమ మేధ నిర్వాకమే కావచ్చు. లక్షల్లో కనిపించే ఆ అనుచరుల సంఖ్య కూడా ఉత్తిదే కావచ్చు. నిజమే అయినా, వాళ్లంతా ‘కిరాయి’ అనుచరులు కావచ్చు. ఓ వంద రూపాయలు ఖర్చుపెడితే చాలు. వందమంది ‘తాత్కాలిక’ ఫాలోయర్స్‌ను కొనుక్కోవచ్చు. ఓ దశకు వచ్చేసరికి ఏది వ్యక్తిగత అభిప్రాయం, ఏది కిరాయి పోస్టు.. అనేది తేల్చుకోవడం చాలా కష్టంగా మారుతున్నది.
మొబైల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ ఇన్వెస్టింగ్, ఆన్లైన్ మల్టీలెవెల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ వ్యవహారాల్లో ఫేక్ కంపెనీలు రాజ్యమేలుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయంతోనే పబ్బం గడుపుకొంటాయి. భారీగా డబ్బు వెదజల్లి ఇన్ఫ్లుయెన్సర్లను కొనేస్తాయి. ఆ మార్కెటింగ్ మాయాజాలం తెలియని సామాన్య మధ్యతరగతి ప్రజలు పెట్టుబడులు పెట్టేస్తున్నారు. నిండా మునిగిపోతున్నారు. ఇలాంటి కంపెనీల మొబైల్ అప్లికేషన్లకు చట్టబద్ధత ఉండదు. పోలీసులు, న్యాయవ్యవస్థ కళ్లుగప్పే ప్రయత్నమే ఇదంతా. కాబట్టే, ఆపిల్ స్టోర్‌లోనో, ప్లే స్టోర్‌లోనో ఇవి లభించవు. లావాదేవీలను కూడా లెక్కల్లో చూపించరు. అన్నీ దొంగ వ్యవహారాలే. ఈ చీకటి పనులకు అడ్డుకట్ట వేయాలంటే.. సమగ్రమైన చట్టాలు రావాలి. అదే సమయంలో మనలోనూ చైతన్యం రావాలి. నిజానిజాలను బేరీజు వేయగల సామర్థ్యం పెరగాలి.
Influencer2
ఇంటర్నెట్ అంటేనే ఓ మాయా ప్రపంచం. ఇక్కడ కనిపించే ప్రతి ప్రకటనా నిజం కాదు. ప్రతి సలహాలోనూ నిజాయతీ ఉంటుందని అనుకోలేం. ఆ ఆఫర్లలో మోసం ఉండవచ్చు. ఆ వస్తువు నాణ్యతలో తేడా ఉండవచ్చు. కాబట్టి, విశ్వసనీయమైన వెబ్సైట్లలోనే లావాదేవీలు నిర్వహించండి. అనుమానం వస్తే డబ్బు చెల్లించకండి. మరిన్ని రివ్యూలు చూడండి. మూలాల కోసం గూగుల్నూ సెర్చ్ చేయవచ్చు. మీ సామాజిక మాధ్యమాల ఖాతాలో ఫోన్ నంబర్ ఎప్పుడూ ఇవ్వకండి. అది దుర్వినియోగమయ్యే ఆస్కారమే ఎక్కువ. మీ ఆత్మీయులకు మెసేజ్ పెట్టి డబ్బు అడగొచ్చు. హ్యాక్ చేసి డాటాను దొంగిలించే ప్రమాదమూ ఉంది. వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేయకపోవడమే మేలు. దాన్ని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడవచ్చు. ఆ ఫొటోతో ఫేక్ ఐడీ సృష్టించి మిమ్మల్ని ఇబ్బందులపాలు చేయవచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మీ పాస్‌వర్డ్‌ను, మీ డేటాను సురక్షితం చేసుకోండి. ప్రతీది డౌన్లోడ్ చేసుకోవాలనే అత్యుత్సాహం వద్దు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు వద్దు. మరీ వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకురాకండి. ఎందుకంటే, మీ పోస్టులను బట్టి మీ అభిరుచులను, వ్యక్తిత్వాలను అంచనా వేస్తారు. మిమ్మల్ని ముగ్గులోకి లాగే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వకండి.
ఫాలోయర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీమీద ఉంది. మోసపూరిత ఉత్పత్తుల ప్రచార బాధ్యత తీసుకోకండి. కాంట్రాక్ట్ కుదుర్చుకునేముందు ఆ కంపెనీ విశ్వసనీయత ఏపాటిదో నిర్ధారించుకోండి. ప్రలోభాలతో పబ్బంగడిపే ఫేక్ సంస్థలను దగ్గరికి రానీయకండి. మీ పోస్ట్‌లలో ఏది సృజనాత్మక కల్పన, ఏది వాస్తవం అనే విషయం ఆ వీడియో కింద స్పష్టంగా ఇవ్వండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?