సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సున్నంచెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు.. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు, తవ్వకాలు ఎలా చేపడతారంటూ హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం హైకోర్టులో సున్నంచెరువు వివాదంపై విచారణ జరిగిన సమయంలో న్యాయమూర్తి అనిల్‌కుమార్ హైడ్రా చర్యలను తప్పుబట్టారు.
సున్నంచెరువు విషయంలో ఎఫ్టీఎల్ నిర్ధారణే జరగలేదని, అటువంటప్పుడు ఎలా హద్దులు నిర్ణయిస్తారని అడిగారు. సర్వే నంబర్లు 12,13 వ్యవహారంలో ఓవర్‌ల్యాపింగ్ జరిగిందనే విషయంపై తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317లోని సెక్షన్ 90ని హైడ్రా ఆశ్రయించకపోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పక్కనే ఉన్న సర్వేనంబర్ల విషయంలో ఎందుకు సీరియస్‌గా వ్యవహరించడం లేదని విచారణ సమయంలో ఆయన అడిగారు. ముందుగా గ్రామ హద్దులు నిర్ధారించడం లేక ఉన్నవాటిని నిజమా? కాదా? అని సర్వే చేయాలి కదా మరెందుకు ఆ దిశగా ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. అసలు చెరువు హద్దులు నిర్ధారించకుండా తవ్వకాలు ఎందుకు చేపట్టారంటూ విచారణ సమయంలో న్యాయమూర్తి హైడ్రాతరపు న్యాయవాదిని ప్రశ్నించారు.
సున్నం చెరువు సియేట్ కాలనీలో హైడ్రా చేపట్టిన చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం అక్కడున్న వారి హక్కుల ఉల్లంఘనకు పాల్పడడమేనన్నారు. గుట్టలబేగంపేటలో సున్నంచెరువు(సుద్దలవానికుంట)లో హైడ్రా చేపట్టిన కొన్ని చర్యలపై న్యాయమూర్తి.. హైడ్రా తరపు న్యాయవాదిని మందలించారు. ముందుగా సున్నంచెరువుకు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో సియేట్ కాలనీవాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం కానీ, కూల్చివేయడంకానీ చేయవద్దని, సెక్షన్ 90 ప్రకారం గ్రామ సరిహద్దులు నిర్ణయించకుండా పౌరవివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు.