Residential Schools | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగుతీసే ప్రక్రియకు సర్కారు స్వస్తి పలుకుతున్నది. స్పెషల్ టీచర్లకు అదనపు బాధ్యతలను అంటగడుతున్నది. దీంతో నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ శిక్షణ అడపాదడపా మాత్రమే జరుగుతున్నది. జాబ్‌చార్ట్‌కు విరుద్ధంగా తమను ఇతరత్రా పనులకే పరిమితం చేస్తుండడంతో స్పెషల్ టీచర్లు నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. అలా ఇప్పటికే పలువురు ఉద్యోగాలను సైతం వదిలిపెట్టారు. తాజాగా మరో సంగీత టీచర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత కూడా అత్యంత అవసరమని విద్యాహకు చట్టం స్పష్టం చేస్తుండటంతో ఆ దిశగా గత బీఆర్ఎస్ సర్కార్ గురుకులాల్లో ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు దాదాపు 2,500 మంది లైబ్రేరియన్లను నియమించింది. వారందరినీ స్పెషల్ టీచర్లుగా పిలుస్తున్నారు. డిప్లొమా, ఫైన్ ఆర్ట్స్ తదితర అర్హతలతో ఎంపిక చేసిన ఈ టీచర్లకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువ. వారికి ఎలాంటి ప్రమోషన్లు లేవు. వారు నిర్వర్తించే విధులు చాలా భిన్నంగా ఉంటాయి. లైబ్రేరియన్లు పుస్తకాలను సప్లయ్ చేయడం, వార్షిక పాఠ్య ప్రణాళికను రూపొందించడం, న్యూస్పేపర్లలో విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించి ప్రదర్శించడం లాంటి విధులు నిర్వర్తిస్తారు.
మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్ టీచర్లు ఆయా కళా నైపుణ్యాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారితో ఆ పనులు కాకుండా ఇతర పనులు చేయిస్తున్నది. గోడలను అందంగా రంగులతో తీర్చి దిద్దడం, విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు ఎసార్టులుగా వ్యవహరించడం, నైట్ కేర్, నైట్ స్టడీ, సమ్మర్ క్యాంప్, కిచెన్ ఇన్స్పెక్షన్, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలకు వినియోగిస్తున్నది. సూటిగా చెప్పాలంటే సావెంజర్ పని తప్ప అటెండర్లు చేసే అన్ని పనులను వారితోనే చేయిస్తున్నారు. దీంతో గురుకులాల్లో విద్యార్థుల సృజనను వెలికితీసే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
ప్రస్తుతం గురుకుల సొసైటీల్లో నెలకొన్న పరిస్థితులు, తమకు అదనపు బాధ్యతల అప్పగింతపై అనేక మంది స్పెషల్ టీచర్లు ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రభుత్వ పెద్దలను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. తమను పూర్తిగా ఇతర పనులకు వినియోగిస్తుండటంతో విద్యార్థులు సృజనాత్మకత అంశాలకు దూరమవుతున్నారని, వారిలో కళా నైపుణ్యాలను మెరుగుపరిచే ప్రక్రియ అటకెక్కుతున్నదని విన్నవించారు. ప్రమోషన్లు లేకుండా చాలా తక్కువ వేతనాలు పొందుతున్న తమపై అదనపు భారం మోపడం తగదని, డిప్యుటీ వార్డెన్ డ్యూటీల నుంచి తమను తప్పించాలని వేడుకున్నారు. అయినా ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం కనికరించడం లేదని, ఉన్నతాధికారులు సైతం అదే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాధ్యతలను కొనసాగించడంతో స్పెషల్ టీచర్లు నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. వారి అభిలాషకు, జాబ్‌చార్ట్‌కు విరుద్ధంగా పనులు చేయిస్తుండటంతో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలను వదులుకున్నారు. అలా తాజాగా గురుకుల సొసైటీకి చెందిన ఓ సంగీత టీచర్ సైతం రాజీనామా చేశారు. అందుకు కారణాలను వివరిస్తూ ఆ టీచర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అపార అనుభవంతో వివిధ రాష్ర్టాల్లో కచేరీలు నిర్వహించి, రూ.లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న ఆ కళాకారిణి.. నిరుపేద విద్యార్థులకు సంగీత పాఠాలు చెప్పడం ద్వారా ఆత్మసంతృప్తి పొందవచ్చనే ఆలోచనతో గురుకులంలో సంగీత టీచర్‌గా చేరానని వివరించారు.
గురుకుల విద్యార్థుల్లో చాలా మందికి సంగీతంపై ఆసక్తి ఉన్నదని, ప్రస్తుతం తనపై పలు అదనపు బాధ్యతలు మోపడంతో ఆ విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని పంచే సమయమే ఉండటం లేదని వాపోయారు. గురుకులాల్లో స్పెషల్ టీచర్లకు విలువే లేకుండా పోయిందని, తమను చాలా చులకనగా చూస్తున్నారని వార్డెన్ చేయాల్సిన పనులను కూడా స్పెషల్ టీచర్లతోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, తమను విద్యార్థుల సృజన మెరుగుదలకు కాకుండా ఇతర పనులకు వినియోగించడంపై పునరాలోచించాలని స్పెషల్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.