Orderly System | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం పరాకాష్ఠకు చేరుకున్నది. సిన్సియర్‌గా విధులు నిర్వహించే పోలీసు ఉన్నతాధికారులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆర్డర్లీ వ్యవస్థ’ను అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో కిందిస్థాయి పోలీసు సిబ్బందంటే ఉన్నతాధికారులకు చులకనైపోయింది.
‘ఆర్డర్లీ వ్యవస్థ’ కింద హోంగార్డులతో వెట్టిచాకిరి చేయించుకుంటుండగా.. కానిస్టేబుళ్లను కూడా కొందరు పోలీసు అధికారులు అలాగే వాడుకుంటున్నారు. ఇంకొందరు అధికారులు తమ కుటుంబసభ్యులకే కాకుండా.. స్నేహితులు, బంధువుల ఇండ్లలో పనికి కూడా కానిస్టేబుళ్లను వెళ్లాలని అనధికారిక ఆదేశాలిస్తున్నట్టు తెలిసింది. కొందరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి.. ఆర్డర్లీ కింద హోంగార్డులు, కానిస్టేబుళ్లతో తమ ఇండ్లలో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఈ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయించింది.
పోలీసుశాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి దారుణంగా తయారైంది. సీఐ నుంచి డీఎస్పీ ఆపై ఉన్నతాధికారుల ఇండ్లలో వారు వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఇంటిపని, వంట పని, గార్డెన్ పని, పెట్స్ కేరింగ్, వంటి అన్ని అడ్డగోలు పనులూ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారుల ఇండ్లలో కూడా హోంగార్డులతో సేవలు చేయిస్తున్నారని వాపోతున్నారు. తెలంగాణ పోలీసు అకాడమీలో మరీ దారుణంగా మున్సిపల్ వర్కర్ చేసే అన్ని పనులూ హోంగార్డులతో చేయిస్తున్న దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌లో పనులు పూర్తవ్వగానే సంబంధిత ఎస్‌హెచ్‌వో, డీఎస్పీ, ఎస్పీల ఇండ్లలో పనులకు వెళ్లాలని, లేకపోతే ఆ వారమంతా ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
‘ఆర్డర్ టు సర్వ్’ కింద ఐపీఎస్‌లు ఎక్కడికంటే అక్కడికి హోంగార్డులను తీసుకెళ్తున్నారు. కొందరు అధికారులు ఇతర రాష్ర్టాలకు వెళ్లినా.. ఇదే రాష్ట్రంలో మరో జిల్లాకు బదిలీ అయినా కూడా.. తమతోపాటు హోంగార్డులను సైతం తీసుకెళ్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అదే ‘ఆర్డర్ టు సర్వ్’ ద్వారా ఎవరైనా హోంగార్డులు తమ సొంత జిల్లాలకు వెళ్తామంటే మాత్రం ఒప్పుకోవడం లేదని బాధపడుతున్నారు. అర్డర్ టు సర్వ్ కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్‌కు 60 మంది హోంగార్డులు 80 కిలోమీటర్లు నిత్యం ప్రయాణం చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీసు వ్యవస్థను, ఆర్డర్లీ వ్యవస్థను ఎంత అడ్డగోలుగా ఉపయోగిస్తున్నారనే దానిపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల ఆధారాలతో మీడియాతో మాట్లాడారు. సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘హైదరాబాద్‌లో ఒక ఇన్నోవా క్రిస్టా కారు పెట్టి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పెట్టాడు. కమిషనర్ తన స్నేహితుడు, ఐఆర్ఎస్ అధికారి అయిన వికాస్ అగర్వాల్ తండ్రి ఇంటికి పంపిస్తాడు. ఓ సాధారణ పౌరుని కోసం ఒక కారు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చి రోజూ ఆయనను నిమ్స్ దవాఖానకు తీసుకువెళ్తారు. 8 నెలల నుంచి ఆ వాహనం డీజీపీ ఆఫీస్ దగ్గరలోని అపార్ట్మెంట్ వద్ద తిరుగుతుంటే డీజీపీ శివధర్‌రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టా? లేనట్టా?’ అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
ఒక శాసనసభ్యుడు పూర్తి ఆధారాలతో సహా నిరూపించినా.. పోలీసుశాఖ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు చర్చలకు తావిస్తున్నది. కిందిస్థాయి సిబ్బంది తప్పులు చేస్తే.. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని పలుమార్లు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారని.. ఇప్పుడు ఏకంగా ఓ పోలీసు ఉన్నతాధికారే అక్రమాలకు పాల్పడితే కనీసం వివరణ కూడా తీసుకోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పోలీసు ఉన్నతాధికారుల ఇండ్లలో పనిచేస్తున్న దాదాపు 3,320 మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఈ నిర్ణయంతో విముక్తి లభించింది. వారిని తక్షణమే ఆ విధుల నుంచి తప్పించి, వారిని తిరిగి శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లోకి తీసుకోవాలని కర్ణాటక డీజీపీ ఎం ఏ సలీం ఆదేశాలు జారీ చేశారు. ఆర్డర్లీకి బదులుగా అధికారులకు వారి హోదాను బట్టి ప్రభుత్వం నగదు అలవెన్స్‌ను ప్రకటించింది.
డీజీపీ స్థాయి అధికారులకు నెలకు రూ. 8వేల నుంచి ఇన్‌స్పెపెక్టర్ స్థాయి అధికారులకు రూ.2,000 వరకు ఈ అలవెన్స్ లభిస్తుంది. వ్యక్తిగత సహాయం కోసం పోలీస్ సిబ్బందికి బదులుగా 373 మంది అటెండెంట్ పోస్టులను సివిల్ పోలీస్ విభాగంలో సృష్టించారు. వీరిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం డీజీపీ, ఏడీజీపీ స్థాయి అధికారులు కేవలం ముగ్గురు సహాయకులను మాత్రమే కలిగి ఉండాలి. ఐజీ, డీఐజీలకు ఇద్దరు, ఎస్పీలకు ఒక సహాయకుడు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ నిర్ణయంతో కర్ణాటక పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.