‘ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఈ సినిమా మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో కొన్ని పాత్రలు ప్రేక్షకుల మైండ్‌లో ఉండిపోతాయి. మైత్రీలో నా మూడో సినిమా ఇది. ఈ సంస్థ నుంచి నా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇందులో ఓ డిఫరెంట్ రవితేజను చూస్తారు. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది’ అని అగ్ర కథానాయకుడు రవితేజ నమ్మకం వెలిబుచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించిన డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. ప్రియా భవానీశంకర్ కథానాయిక. బేబీ నక్షత్ర కీలక పాత్రధారి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ఇందులో కథానాయకుడి పేరు త్రినాథ్. అతని ప్రపంచం ఓ ఎక్స్ట్రార్డినరీ ఎమోషనల్ ఫీల్‌ని ఆడియన్‌కి ఇస్తుంది. కూతురుకి స్వతంత్య్రం ఇచ్చే తండ్రి కథ ఇది. అందరి ఆడపిల్లల్లో తన కూతురునే చూస్తుంటాడు ఇందులో హీరో. దానికి ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నా. చాలా టెన్షన్ పెట్టే థ్రిల్లర్ ఇది. చివరి 20 నిముషాలైతే ఆడియన్ భావోద్వేగానికి లోనవుతాడు. ఇది ప్రాపర్ సీరియస్ మూవీ. రవితేజ నటన కోసం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు’ అని పేర్కొన్నారు. ఇంకా కథానాయిక ప్రియా భవానీశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్, సాయికుమార్, అజయ్‌ఘోష్ తదితర చిత్రబృందంతో పాటు దర్శకులు కె.ఎస్.రవీంద్ర(బాబీ), సాయిరాజేశ్, బుచ్చిబాబు, రాహుల్ సంకృత్యాన్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు మాట్లాడారు.