ఖైరతాబాద్, నవంబర్ 26 : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ నుంచి కులగణన, జీవోల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేశారని ఆల్ ఇండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపించారు. బుధవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు ఇస్తామన్న హామీలన్నీ మూసాలేనన్నారు. అందులో భాగంగానే తాను సొంతంగా చెప్పకుండా పక్క రాష్ట్రం నుంచి బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకొచ్చి ఆయనతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పించారన్నారు. ప్రతి ఏడాది బీసీల సంక్షేమానికి రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారన్నారు.
రేవంత్‌రెడ్డి నాడు బీసీలను మోసం చేయాలని నిర్ణయించుకొని సిద్ధరామయ్యతో హామీ ఇప్పించారన్నారు. డిసెంబర్ 23న అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి వరకు కులగణన ఊసే ఎత్తలేదన్నారు. మళ్లీ సెప్టెంబర్ వరకు మాట్లాడలేదని, బీసీలు ఉద్యమించడంతో బీసీ కమిషన్ ద్వారా పూర్తి చేస్తామని, డెడికేషన్ కమిషన్ ద్వారా వెనుకబాటుపై లెక్కలు వేసి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారని, తిరిగి మళ్లీ ప్లానింగ్ కమిషన్, వన్‌మెన్ కమిషన్ల పేరుతో బూటకపు కులగణన చేశారన్నారు. ఇప్పటి వరకు ఆయా కమిషన్ల వివరాలను ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే అన్ని రకాలుగా కాలయాపన చేశారన్నారు. నేడు 42 శాతం కాదు, కనీసం 18 శాతం కూడా రిజర్వేషన్లు రావడం లేదన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ఆపాలని హైకోర్టులో రిట్ వేస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో ఎన్నికల నోటిఫికేసన్ ఇచ్చిన తర్వాత కూడా రద్దు చేశారని గుర్తు చేశారు. ఒకవేళ స్టే రాకపోతే, 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రాతిపదికన పంచుకొని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. అందుకు తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామపంచాయతీకి వెళ్లి అన్ని ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బీసీలకు చేసిన మోసం ప్రభావంతో రాబోవు ఎన్నికల్లో తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భాస్కర్, బీసీ సంఘాల నాయకులు నాగూర్ల శ్రీనివాస్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.