వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 15 నుంచి 20 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఓ వైపు చేతికొచ్చే దశలో వానలతో పంటకు తీరని నష్టం జరుగగా, మరోవైపు కోతలు, కుప్పలు వేయడం, ధాన్యం తరలించడం వంటి యాజమాన్య పనులకు అధికంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కనీసం పెట్టిన పెట్టుబడి రాక అన్నదాతల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లాలో రెండు మూడు మండలాలు మినహా మిగతా మండలాలన్నీ ఆయకట్టు పరిధిలోనే ఉన్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు లేని మండలాల్లోనూ నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో కొన్నేండ్లుగా జిల్లాలో మెరుగైన దిగుబడి వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా సాగు భూమిలో 85 శాతం భూభాగంలో వరి పంటనే రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. కొన్నేళ్లుగా వానకాలం సీజన్లో వరి సాధారణ దొడ్డు రకాలు సగటున 24 నుంచి 26 క్వింటాళ్లు ఎకరానికి దిగుబడినిస్తున్నాయి. కొందరు రైతులు 30 క్వింటాళ్ల దాకా దిగుబడిని సాధిస్తున్నారు.
ఇక సన్న రకాలు సాగు చేసే రైతులు ఎకరానికి సగటున 20 నుంచి 24 క్వింటాళ్ల దిగుబడిని తీస్తున్నారు. అయితే ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 8 లక్షల మెట్రిక్ టన్నుల కంటే అధిక దిగుబడి వస్తుందని, అందులో విక్రయానికి 6లక్షల మెట్రిక్ టన్నుల వరకు మార్కెట్లోకి రావచ్చునని అధికారులు అంచనా వేశారు. అయితే కోతలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంచనాలు అన్ని తగ్గిపోయాయని చెబుతున్నారు. గతేడాది వానకాలం దిగుబడితో పోలిస్తే సగటున ముప్పై నుంచి నలభై శాతం వరకు తక్కువగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం దిగుబడి తగ్గిన మాట వాస్తవమే కానీ, రైతులు చెబుతున్న స్థాయిలో ముప్పై నుంచి నలభై శాతం తగ్గుదల లేదని చెబుతుండడం గమనార్హం.
దిగుబడి తగ్గేందుకు అనేక కారణాలు
దిగుబడి తగ్గేందుకు అనేక కారణాలు ఉన్నట్టుగా రైతులు, ఇటు అధికారులు చెబుతున్నారు. ఈ యేడాది వానలు సకాలంలో కురవడంతో రైతులు పంటలు సకాలంలో వేశారు. కానీ, ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలను దెబ్బతీశాయని రైతులు వాపోతున్నారు. మొదటి నుంచి వరి పంట పెరుగుదల సక్రమంగానే నమోదైందని, అయితే అధికంగా పడిన వర్షాలు ప్రతి నెలలోనూ ఇబ్బంది పెట్టాయంటున్నారు. ముఖ్యంగా పంట పాలుపోసే దశలో పడిన అధిక వర్షాలు శాపంగా మారాయని, పూత పూర్తిగా రాలిపోయిందని చెబుతున్నారు. పుష్ప పరపరాగ సంపరం సమృద్ధిగా జరిగినట్టే కనిపించిందని, అయితే ధాన్యాన్ని కోస్తే అవి తాలుగానే బయటికి వెళ్లిపోయాయని, గింజగా గట్టిపడలేదని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల వరి పైరుకు కాటుక రోగం రావడం వల్ల విత్తనాలల్లో పూర్తిగా గింజలు సమృద్ధిగా తయారు కాలేకపోయాయని, ఈ కారణాలతో తమకు సరైన దిగుబడి రాలేదని వాపోతున్నారు.
యాజమాన్య విధులకు అధిక చెల్లింపులు
అకాల వర్షాలతో వరి తీవ్రంగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి ఓ వైపు ఇబ్బందులు పడితే, మరో వైపు యాజమాన్య విధుల నిర్వహణకు మరింత అధికంగా చెల్లింపులు చేయాల్సిన దుస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఈ యేడాది జూన్ నుంచి అక్టోబర్ దాకా నిరంతరం వర్షా లు పడుతూనే ఉండడంతో భూమి పూర్తిగా ఆరని స్థితికి చేరింది. మరోవైపు కోత దశలోకి అధిక వర్షాలు కురవడం వల్ల నీరు వదిలేసినా పొలాలు పూర్తిగా తడిగా మారిపోయాయి. వరిగొలకలు నేలకొరిగి గింజలు నల్లబడడంతో పాటు హార్వెస్టింగ్ చేసే సమయంలో పూర్తిస్థాయిలో కోతలు జరగని దుస్థితి నెలకొన్నది. తడిగా ఉన్న పొలాల్లో కోతలకు టైర్ల మిషన్‌కు బదులు బెల్ట్ మిషన్లను వినియోగించాల్సి వస్తుందని, రైతులపై అధిక భారం పడుతుందంటున్నారు.
టైర్ల మిషన్‌కు చెల్లించే కిరాయి కంటే బెల్ట్మిషన్కు చెల్లించే కిరాయి రెండు రెట్లు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. టైర్ల మిషన్ గంటకు సగటున 1800 నుంచి 2వేల వరకు కిరాయికి వస్తుండగా, బెల్ట్ మిషన్ గంటకి 3500 నుంచి 3,800 వరకు చెల్లిస్తున్నారు. ఒకవైపు తగ్గిన దిగుబడితో ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం కోల్పోతే, కోతలు, కుప్పలు వేయడం ధాన్యం తరలింపు వంటి యాజమాన్య పనులకు చెల్లించే మొత్తం గతం కంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అధికంగా ఉంటుందంటున్నారు. ఇన్ని కష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా, కొనుగోలు సమయంలో రైస్ మిల్లర్లు అధిక తూకం దోపిడీతో క్వింటాలుకు సుమారుగా 100 నుంచి 150 వరకు ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 క్వింటాళ్లు తగ్గింది
నేను మొదటి సంది ఎవుసం చేస్తున్న. కొన్నేళ్లుగా మంచి దిగు డులు తీస్తున్న. మొన్న వానకాలంలో నాకున్న ఐదున్నర ఎకరాల భూమి లో దొడ్డురకం వరి సాగు చేసిన. ఇటీవలే పంటను కోయించిన. దిగుబడిని చూసి కంగుతిన్న. కేవలం 110.80 క్వింటాళ్ల (277 బస్తాలు) ధాన్యమే వచ్చింది. నాకు సగటున ఎకరానికి 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేది. కానీ, ఈ సారి రాలేదు. కొన్నేండ్లుగా వానకాలం సీజన్లో 150 నుంచి 160 క్వింటాళ్లు వచ్చేది. ఇప్పుడు దాదాపు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది.
– కానుగంటి మల్లేశం, సర్వాపూర్ (మల్యాల మండలం)