న్యూఢిల్లీ: ఇరాన్ సంక్షోభం(Iran Crisis) మొదలయ్యి నేటికి నాలుగవ రోజే. కానీ అనూహ్య రీతిలో ఆయుధ సంపత్తి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దగా ఎవరి మద్దతు లేకుండానే ఇరాన్ తన డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసినా.. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే రీతిలో లేనట్లు కనిపిస్తున్నది. శనివారం జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తన వద్ద ఉన్న డ్రోన్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దాదాపు అన్ని గల్ఫ్ దేశాలపై తమ డ్రోన్లను వదలింది. అమెరికా మిత్ర దేశాల వద్ద ఉన్న పాట్రియాట్ మిస్సైళ్లు ఆ డ్రోన్లను ఎదుర్కొనే పనిలో పడ్డాయి. అయితే ఏకధాటిగా ఆయుధాలు వాడడం వల్ల .. ఎవరు ముందుగా తమ ఆయుధ సంపత్తిని కోల్పోతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాని ఆధారంగానే యుద్ధ ఫలితాన్ని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు.
ఇరాన్ తన షాహిద్-136 డ్రోన్లను వాడుతున్నది. క్రూయిజ్ క్షిపణుల తరహాలో ఈ డ్రోన్లు టార్గెట్ వద్దకు వెళ్లి ధ్వంసం చేస్తాయి. ఈ డ్రోన్ల వల్లే పశ్చిమాసియా దేశాల్లో కొంత అలజడి నెలకొన్నది. అన్ని అమెరికా బేస్‌లు, ఇంధన కారాగారాలు, నివాస స్థలాలపై ఆ డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేసింది. కానీ అమెరికా, ఇజ్రాయల్ దళాలు తమ దాడి కోసం క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, ప్రిసిషన్ గైడెడ్ బాంబ్లను వినియోగించింది.
వాస్తవానికి అమెరికా తయారీకి చెందిన పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు చాలా వరకు ఇరాన్ షాహిద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలిగాయి. సుమారు 90 శాతం వరకు పాట్రియేట్ క్షిపణులు ఇరాన్ డ్రోన్లను చిత్తు చేసినట్లు యూఏఈ చెప్పింది. అయితే 4 మిలియన్ల డాలర్లు ఖర్చే అయ్యే పాట్రియేట్ మిస్సైల్‌తో .. దాదాపు 20 వేల డాలర్లకు తయారయ్యే డ్రోన్‌ను కూల్చడం ఓ పెద్ద సమస్యగా మారింది. చాలా తక్కువ ఖర్చుతో తయారైన షాహిద్ డ్రోన్లు పెద్ద పెద్ద యుద్ధాల్లో పెను సవాల్‌గా మారినట్లు డిఫెన్స్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పోరాటం సాగుతున్న తీరు గమనిస్తే, అమెరికా.. ఇరాన్ త్వరలోనే తమ ఆయుధ నిల్వల్ని కోల్పోయే అవకాశం ఉన్నది. అయితే చివరి వరకు ఎవరి వద్ద ఆయుధ సంపద ఉంటుందో వారికే ఎక్కువ అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉన్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికా ఆయుధాలు క్షీణిస్తే, అప్పుడు గల్ఫ్ దేశాలు అగ్రరాజ్యంపై వత్తిడి తెస్తే, ఆ క్షణంలో ఇరాన్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొందరు నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం ఖతార్ వద్ద ఉన్న పాట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణుల స్టాక్స్ వేగంగా కరిగిపోతున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని దోహా అగ్రరాజ్యాన్ని ఇప్పటికే కోరుతున్నది. గత ఏడాది ఇజ్రాయల్‌తో యుద్ధం జరిగిన తర్వాత ఇరాన్ సుమారు రెండు వేల బాలిస్టిక్ క్షిపణులను పోగు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇక షాహిద్ డ్రోన్లు అంతకు మించిన సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డ్రోన్లను రష్యా ఉత్పత్తి చేస్తున్నది. ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో ఆ డ్రోన్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు డిఫెన్స్ నిపుణులు బెకా వేసర్ తెలిపారు.
తాజా ఫైట్‌లో ఇప్పటి వరకు టెహ్రాన్ సుమారు 1200 ప్రొజెక్టైల్స్‌ను ఫైర్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. దీంట్లో ఎక్కువ శాతం షాహిద్ డ్రోన్లు ఉన్నాయి. ఈ ఎత్తుగడ ద్వారా ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తన అమ్ములపొదిలో దాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వాటిని చివరి దశలో వినియోగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అయితే ట్రంప్ చెప్పినట్లు రాబోయే నాలుగు వారాలకు కావాల్సిన ఆయుధాలను అమెరికా సమీకరించుకున్నట్లు తెలుస్తోంది. ఇదేమీ ఇరాక్ యుద్ధం కాదు అని, ఇది అంతం లేనిది కాదు అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సీత్ పేర్కొన్న విషయం తెలిసిందే. అమెరికా దళాలు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థకు చెందిన పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను వాడుతున్నాయి. పీఏసీ-3 మిస్సైల్స్‌ను పాట్రియాట్ ఫైర్ చేస్తుంది. ఈ క్షిపణుల ఉత్పత్తిని పెంచే ఆలోచనలో పెంటగాన్ ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌హీడ్ ప్రకారం గత ఏడాది కేవలం 600 పీఏసీ-3 క్షిపణులను మాత్రమే కొత్తగా నిర్మించారు. గత శనివారం నుంచి పశ్చిమాసియా దాడుల్లో ఎక్కువ శాతం ఇంటర్సెప్టార్ క్షిపణులను వినియోగించినట్లు తెలుస్తోంది.
లాక్‌హీడ్ కంపెనీకి చెందిన థాడ్ అనే అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టమ్‌ను సౌదీ అరేబియా, యూఈఏ ప్రస్తుతం వాడుతున్నాయి. అయితే ఈ క్షిపణు ఖరీదు కూడా ఎక్కువే. థాడ్లో వాడే క్షిపణి ఖర్చు సుమారు 12 మిలియన్ల డాలర్లు ఉంటుంది. ఇక్కడ కూడా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్‌ను కూల్చేందుకు ఎక్కువ ఖర్చు ఉన్న క్షిపణి వాడాల్సి వస్తున్నది. ఇజ్రాయల్ డిఫెన్స్ కంపెనీ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసిన ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థను ఐడీఎఫ్ ఇంకా ఈ వార్‌లో వాడలేదు. ఒకవేళ ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే, అప్పుడు పీఏసీ-3 క్షిపణుల స్టాక్ వేగంగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఎవరు ఎన్ని ఆయుధాలు సమకూర్చుకోగలిగితే, వార్ అన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.