సిద్దిపేట, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది.ఇది నమ్మిన బీసీలు కాంగ్రెస్ పార్టీని అనుకూలంగా వ్యవహరించారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ హామీని రేవంత్ సర్కారు తుంగలో తొక్కింది. 42శాతం కాదు కదా కేవలం ఓవరాల్గా 17శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు.
ఆ సమయంలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కేసీఆర్ 23శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు కేవలం 17 శాతానికి రిజర్వేషన్లు పరిమితం చేయడతో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చేదాక ఒకమాట, గద్దెనెక్కాక మరోమాట అన్నట్టు రేవంత్ సర్కార్ తీరు ఉందని బీసీలు మండి పడుతున్నారు.బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఎటూ తేలకుండానే ఆగమేఘాల మీద గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం షెడ్యూల్ను విడుదలైంది. రెండేండ్లుగా లేని హడావిడి ఇప్పుడే ఎందుకు వచ్చిందో చెప్పాలని బీసీ వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదని ఆ వర్గాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. గతంలో ఇచ్చిన శాతం రిజర్వేషన్లు ఇప్పడు బీసీలకు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో దామాషా ప్రకారం ఎస్టీ, ఎస్సీ రాజ్యాంగబద్ధ్దంగా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామన్న 42శాతం రిజర్వేషన్లు గాలికి వదిలివేశారని మండి పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో బీసీలు అధికంగా ఉన్నా వారికి కేటాయించలేదు. రొటేషన్ పద్ధ్దతిలో రిజర్వేషన్ అమలు చేయాలని జీవో 46ను విడుదల చేసింది.
దీని ప్రకారం ఎక్కడా రొటేషన్ పద్ధ్దతిలో రిజర్వేషన్లు జరగలేదని బీసీలు మండిపడుతున్నారు. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లు చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 136 గ్రామాలకు మాత్రమే బీసీలకు కేటాయించారు. అంటే కేవలం 26.772 శాతం స్థానాలు కేటాయించారు. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉండగా, బీసీలకు 108 గ్రామ పంచాయతీలు కేటాయించారు. ఇక్కడ 21.951 శాతం వచ్చింది. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, 117 గ్రామ పంచాయతీలను బీసీలకు కేటాయించారు. ఇక్కడ బీసీలకు 19.086 శాతం రిజర్వేషన్ మాత్రమే దక్కింది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీలకు తీరని అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోకా చేసింది. అని మండిపడుతున్నారు.
