రంగారెడ్డి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలోని విలువైన భూములు జిల్లా ఆదాయంపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. శంషాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దీక్షా దివస్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏకపక్షంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించడం జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. జిల్లా ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేక చర్య అని ఆమె విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం అశని పాతంగా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం
జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారులో విస్తరించి ఉన్న జిల్లాలోని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మున్సిపాలిటీలకు పెద్దఎత్తున నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం కోసం కృషి చేసిందన్నారు. శివారు మున్సిపాలిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాటి ఆదాయాన్ని కొల్లగొట్టడం కోసం ప్రభుత్వం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం జిల్లా ప్రజలను మరింత కుంగదీసిందన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రజలపై తీవ్ర పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. జిల్లా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జిల్లా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, యువ నాయకులు కార్తీక్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రైతు బంధు మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, నాయకుడు దండెం రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలున్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్‌లో విద్యాలయాలా..!
కొడంగల్, నవంబర్ 26 : ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటకు సేకరించిన స్థలంలో విద్య, వైద్యాలయాలు నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో సీఎంకే తెలియాలని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య భారతదేశంలో శంకుస్థాపనలు చేసిన చోటే అభివృద్ధి పనులు కొనసాగించకుండా మరో ప్రాంతానికి తరలించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
