భోపాల్: వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడ్డారు. మహిళ చేతిలో ఉన్న పసి బాలుడు గాల్లో ఎగిరి కారు టాప్‌పై పడ్డాడు. డ్రైవర్ ఆపకపోవడంతో పది కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా కారు టాప్‌పైనే ఉన్నాడు. (Child On Car Roof) గాయపడిన ఆ చిన్నారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత కారులోని వారు పారిపోయారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఈ సంఘటన జరిగింది. నవంబర్ 24న సాయంత్రం 7 గంటల సమయంలో వదిన మున్నీ సాకేత్, ఆమె పసిబిడ్డ సూరజ్‌తో కలిసి ఉమేష్ బైక్‌పై వెళ్తున్నాడు. బహెరా దాబర్ గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వారి బైక్‌ను ఢీకొట్టింది. ఉమేష్, మున్నీ రోడ్డుపై పడిపోయారు.
కాగా, ప్రమాదం ధాటికి ఏడాదిన్నర వయస్సున్న సూరజ్ గాల్లోకి ఎగిరి స్కార్పియో టాప్‌పై పడ్డాడు. అయినప్పటికీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపలేదు. సుమారు పది కిలోమీటర్లు అలాగే నడిపాడు. గమనించిన పలువురు ఆ కారును వెంబడించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు కారు టాప్‌పై ఉన్న చిన్నారిని అందులో ఉన్న వారు లోపలకు లాగారు. తల, శరీరానికి గాయాలైన పసి బాలుడ్ని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి పారిపోయారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కాగా, చిన్నారి తల్లి, బంధువైన వ్యక్తి సిధిలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్ ప్రమాదంలో గాయపడిన ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన ఉత్తరప్రదేశ్ రిజిస్టర్ నంబర్ కారు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
VIT University | యూనివర్సిటీలో కామెర్లు వ్యాప్తి.. విద్యార్థుల ఆందోళన, వాహనాలకు నిప్పు
Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడి కేసులో.. కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
Watch: విరిగిన బాస్కెట్ బాల్ పోల్.. జాతీయ స్థాయి క్రీడాకారుడు మృతి