కలెక్టరేట్, మార్చి 9 : బాధితులు అధికారుల వద్దకు రావడం కాకుండా, అధికారులే బాధితుల వద్దకెళ్లి సమస్యలపై ఆరా తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నూతన కలెక్టర్ చిత్రా మిశ్రా. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వయోవృద్ధులు, దివ్యాంగులకు అధికారులు కూర్చునే లాబీల ముందు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయించారు. వారంతా అక్కడే కుర్చీల్లో కూర్చోగా, కలెక్టర్ చిత్రామిశ్రా స్వయంగా వారి వద్దకెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్లకేళ్లుగా వారు పడుతున్న బాధలు ఆమెకు చెప్పుకొని కన్నీటి పర్యంతమవగా, చలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఎలాంటి సమస్య అయినా పరిష్కరించి, న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు తాము చాలా సార్లు వచ్చాం. కానీ, మమ్ముల్నెవరూ ఇట్లా పట్టించుకోలేదంటూ చెప్పడంతో, ఎలాంటి సమస్య ఉన్నా తన వద్దకు నేరుగా వచ్చి చెప్పుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ఆశలొదులుకున్న పలువురు బాధితులు, కొత్త కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుతో తమ ఇబ్బందులు తొలగుతాయేమోననే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సోమవారం నాటి ప్రజావాణిలో 352 దరఖాస్తులు రాగా, కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కె.మహేశ్వర్‌తో పాటు పలు ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
గ్రామంలోని సర్వే నం.98లో గల భూమిలో మాకు 8.24 ఎకరాల భూమి వంశపారంపర్యంగా వస్తున్నది. ఇందులో 1.17 ఎకరాల భూమి ఎస్సారెస్పీ కాలువ కోసం స్వాధీనం చేసుకున్నరు. కానీ, రికార్డుల నుంచి మాత్రం తొలగించలేదు. దీంతో, ఈ నంబర్లోని భూమిని కొంతమంది ఆక్రమించుకుని తమదేనని చూపుతున్నారు. వాస్తవానికి మా భూమి మాత్రమే కబ్జాదారులు ఆక్రమించుకుని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నరు. వెంటనే రికార్డుల్లో నుంచి తొలగించి మాకు న్యాయం చేయాలి. ఇప్పటికే పలుమార్లు వచ్చాం. కొత్త కలెక్టర్ తొలగించాలని ఆదేశిస్తుందని ఆశతో ఉన్నం.
నేను ఏండ్లకేండ్లుగా వస్తున్న. ఎప్పుడు కూడా నా సమస్య పరిష్కారం కాలేదు. నా పేరిట ఉన్న భూమి మా పాలొల్లు ఆక్రమించుకున్నరు. వాళ్ల పేరుకు మార్చుకున్నరు. ఆ భూమిలోకి నన్ను, నా పిల్లలను రానిస్తలేరు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు వచ్చి పరిశీలించలేదు. నాకు న్యాయం జరుగలేదు. నాపిల్లలు కూలి పనులు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నరు. నాపేరిట సుభాష్‌నగర్‌లో ఉన్న నాలుగు గుంటల భూమి నాకు చెందేలా చర్యలు తీసుకోవాలే. ఈడికి ఎప్పుడచ్చినా నేనే సార్ల దగ్గరకు వెళ్లేదాన్ని. ఇయ్యాల మాత్రం నాదగ్గరికే కలెక్టరమ్మ వచ్చిందంటే నా బాధ తీరుతదని అనుకుంటన్న.
సమస్యలపై విన్నవించేందుకు ప్రజలు ప్రతి వారం సుదూర ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి వస్తూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగి వేసారిపోతున్నారు. ఈ క్రమంలో వారు తమకు అందుబాటులోనే సత్వర పరిష్కారం పొందేలా.. కలెక్టర్ ప్రజావాణి నిర్వహణ విధానం మార్చారు. వ్యక్తిగత, సామాజిక, ఇతర సమస్యలపై మూడేళ్లుగా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య, ఏయే రకమైన ఫిర్యాదులు వచ్చాయో ఆయా ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సేకరించి, గమనించారు. రాబోయే సోమవారం నుంచి మండలాల వారీగా నిర్వహించాలని సంబంధితాధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
విద్యానగర్, మార్చి 9: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులకు సూచించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు సకాలంలో వైద్య సేవలందేలా ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు మెరుగుపరచాలని, తదితర సూచనలిచ్చారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, వీవో ఎన్ సీడీ ఉమశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ వోలు రాజగోపాల్, చంద్రశేఖర్, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.