భువనగిరి అర్బన్ మార్చి 9. : విద్యార్థులకు కావాల్సింది విగ్రహాలు కాదని, వారికి ఇవ్వాల్సిన రూ.9 వేల కోట్ల సాలర్షిప్ ఫీజు బకాయిలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పి.మోదీ రాందేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం స్కాలర్ షిప్లు, ఫీజు బకాయిలు ఎగ్గొట్టి పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భువనగిరి బాలుర ప్రభుత్వ కళాశాల ఎదుట రహదారిపై విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గాంధీ విగ్రహాలు పెట్టేందుకు, మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు ఉంటాయి కానీ, విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. సాలర్షిప్లు ఇవ్వక పోవడంతో విద్యార్థులు పరీక్షల సమయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కడితేనే హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. రానున్న బడ్జెట్లో విద్యారంగానికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఇంజినీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరికీ ఓవర్సీస్ సాలర్షిప్ ఇవ్వాలన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని , కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలన్నీ పరిషరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
100 రోజుల్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు తప్ప రాష్ట్ర ప్రజల బతుకుల్లో ఏమీ మార్పురాలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి, రానున్న బడ్జెట్లో విద్యారంగానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద యెత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన శంకర్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు వేముల అనిల్, ఉడతల సాయి, ఎడ్ల మహాలింగం, దీపక్, ఉదయ్, ఆర్యన్, మానస, ఉదయ్ శ్రీ, రమాదేవి, వినూత్న, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.